YCP leaders Attacks on TDP Leaders: నిన్నమొన్నటి వరకూ పల్నాడు ప్రాంతానికే పరిమితమైన దాడుల సంస్కృతి ఇప్పుడు వినుకొండకు పాకింది. ఏకంగా ఎమ్మెల్యేనే రోడ్డెక్కి విపక్షాలపై సవాళ్లు విసరటం, తమ పార్టీ వారితో దాడులు చేయించటం, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించటం వంటి కొత్త సంస్కృతి మొదలైంది. అధికార పార్టీ నేతల మెప్పు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన కొందరు పోలీసుల అందుకు సహకరిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘర్షణల్లో బాధితులపైనే కేసులు పెట్టే సంస్కృతి కొనసాగుతోంది. ప్రతిపక్షాలపై దాడులు జరిగితే బాధ్యులైన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు.. బాధితులపైనే కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల శావల్యాపురంలో టీడీపీ ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాహనం ఆపి మీసం తిప్పి సవాల్ విసిరి కవ్వింపులకు దిగారు.
ఈ ఘటనలో తెలుగుదేశం నేతలపైనే కేసులు నమోదు చేశారు. వినుకొండ నియోజకవర్గంలో పనిచేసే ఓ ఎస్‌ఐ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించి పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరో ఎస్‌ఐ అయితే తనకు అన్యాయం జరిగిందని స్టేషన్‌కు వెళ్లిన టీడీపీ సానుభూతిపరుడిని నాలుగురోజుల పాటు హింసించి తీవ్రంగా కొట్టారు.
రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు: తీవ్రగాయాలపాలైన బాధితుడికి అధికారపార్టీకి చెందిన నేత నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ద్విచక్రవాహనంపై పడితే దెబ్బలు తగిలాయని చెప్పాలని హెచ్చరించి అక్కడి నుంచి పంపిచేశారు. ఎన్నికలప్పుడు ఘర్షణ పడటం మినహా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వినుకొండలోనూ ఇటీవల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాల కార్యక్రమాలు జరిగేటప్పుడు ఉద్దేశపూర్వకంగా అధికారపార్టీ నేతలు రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుతో వినుకొండలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
"శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కావాలనే, దురద్దేశ్యంతో ర్యాలీ మధ్యలోకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మా కార్యకర్తలపై దాడులు చేశారు. అయిన కూడా మేము పోలీసులకు సహకరిస్తూ దారి ఇచ్చాము. దారి ఇచ్చినప్పుడు వెళ్లకుండా.. ఎమ్మెల్యే కూడా రౌడీలాగా ప్రవర్తించాడు." -ప్రతిపక్ష నేత
ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య గొడవలు జరగటం సాధారణం. ఫలితాల తర్వాత ఏపార్టీ కార్యక్రమాలు వారు నిర్వహించుకునేవారు. గత నాలుగేళ్లలో మాచర్ల, గురజాల నియోజకవర్గంలో రాజకీయ కారణాలతో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ కఠినంగా అణచివేయకపోవడంతో నరసరావుపేట, వినుకొండకు కూడా విస్తరించాయి. వినుకొండలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల కాలంలో వరుసగా గొడవలు జరుగుతున్నాయి. గ్రానైట్, గ్రావెల్, సున్నపురాయి వంటి ఖనిజాలు విస్తారంగా లభిస్తుండటంతో అక్కడి అధికారపార్టీ నేతలు సహజవనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా లేకపోగా కేసులు ఖాకీల నుంచి బెదిరింపులు బహుమతిగా వస్తున్నాయి. వీటికి భయపడిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వినుకొండకు పాకిన దాడుల సంస్కృతి