YSRCP Leaders Attacked TDP Activist: పల్నాడు జిల్లా అమరావతిలో తెలుగుదేశం కార్యకర్త వద్ధినేని సంజయ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అర్థరాత్రి గుంపుగా ఇంటికి వచ్చిన వైసీపీ నేతలను సంజయ్ భార్య శ్రీదేవి అడ్డుకుంది. దాడి చేసేందుకు వచ్చిన వారిని చరవాణిలో చిత్రీకరించేందుకు యత్నించగా.. వైసీపీ నాయకులు ఫోన్ లాక్కుని ఆమెపై దాడి చేశారు.
అక్రమాలను ప్రశ్నించినందుకు: బాధితురాలు కేకలు వేయడంతో.. అక్కడినుంచి వారు పారిపోయారు. దాడికి పాల్పడిన వైసీపీ నేత నండూరి కరుణ కుమార్ సహా మరో ఆరుగురిపై సంజయ్ భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిలో వైసీపీ వాలంటీర్ కంభంపాటి దినేష్.. జగనన్న కాలనీలో ఇళ్లు ఇప్పిస్తానని బాధితులను మోసం చేశారు. దీన్ని సోషల్ మీడియాలో సంజయ్ పోస్ట్ చేశారు. దీనిని తొలగించాలంటూ తమ ఇంటిపై దినేష్ మద్దతుదారులు దాడి చేశారని బాధితులు వాపోయారు.
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలి: వైసీపీ నేత నండూరి కిరణ్ కుమార్ అలియాస్ బన్నుతో మాకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కాలచక్ర కాలనీలో వాలంటీర్ దినేష్ అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే.. మాపై దాడిచేశారని టీడీపీ మద్దతుదారులు వద్దినేని సంజయ్ కుమార్, శ్రీదేవి వాపోయారు. తమ ఇంటిపై దాడి చేయడం ఇది రెండోసారి అని.. తమ కుటుంబానికి బన్ను వల్ల ప్రాణ హాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.