Attack on TDP activist: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కాకాని ఏసురాజుపై వైకాపా వర్గీయులు కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన జరిగింది. కాకాని ఏసురాజు ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లాడు. అక్కడినుంచి మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై అలవాల తిరిగి వస్తుండగా.. తురిమెళ్ల-అచ్చయ్యపాలెం గ్రామాల మధ్యకు రాగానే వైకాపాకు చెందిన 11 మంది ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ఏసురాజుపై కారం చల్లి ఇనుపరాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏసురాజును అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుడు బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైకాపా వర్గీయుల అరాచకం... తెదేపా కార్యకర్తపై కారం చల్లి..
Attack on TDP activist: రొంపిచర్ల మండలం అలవాల వద్ద తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై కారం చల్లి... ఇనుపరాడ్లతో దాడి చేశారు. రొంపిచర్ల ఎస్సై అండదండలతో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు: కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న రాజుపై రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, వాలంటీర్లు గోపాల్, నాగరాజు, మరికొందరు కారం చల్లి ఇనుప రాడ్లు, బండరాళ్లతో తీవ్రంగా కొట్టారని క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఏసురాజు చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారన్నారు. ఏసురాజు భార్య మరియ కుమారి, తల్లి సింగమ్మ నరసరావుపేట ఏరియా ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా నేత అరవిందబాబుకు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబంపై ఎంపీపీ భర్త వెంకట్రావు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఏసురాజును హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల అలవాలలో తిరునాళ్ల సందర్భంగా చోటు చేసుకున్న చిన్న వివాదంలో ఏసురాజుపై హత్యాయత్నం కేసు పెట్టి, వేధించారని చెప్పారు. రొంపిచర్ల ఎస్సై అండదండలతో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
ఇవీ చదవండి: