ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాను గెెలిచి ఇతరులకు ఉపాధి కల్పించిన వనిత - పల్నాడు జిల్లాలో మహిళల బ్యాగుల తయారీ

Women Bags Making: అవకాశాలు లేక సంక్షోభంలో పడిపోవటం కాదు సంక్షోభాల్లోనూ అవకాశాలు వెదుక్కోవటం.. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవటం అనేది విజయానికి బాటలు వేస్తుంది. పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన, కరోనా వంటి సంక్షోభ సమయంలో వచ్చిన అవకాశం పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళను పారిశ్రామికవేత్తగా మార్చింది. తాను ఎదగటమే కాకుండా మరికొందరు మహిళలకు ఉపాధి చూపిస్తూ స్ఫూర్తిగా నిలిచారు.

Women self-reliance
మహిళలు స్వావలంబన

By

Published : Dec 27, 2022, 3:53 PM IST

Women Bags Making: పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆరె శ్రావణి... మూడేళ్ల క్రితం వరకూ సాధారణ గృహిణి మాత్రమే. ప్రస్తుతం ఓ చిన్నపాటి పరిశ్రమకు యజమాని. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి కలుగుతున్న హానిని గమనించిన శ్రావణి.... ప్రత్యామ్నాయంగా జనపనార, గుడ్డ సంచులను వినియోగించటం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయవచ్చని భావించారు. కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం అందించిన ప్రత్యేక ప్యాకేజీని శ్రావణి సద్వినియోగం చేసుకున్నారు.

సంచుల తయారీ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనతో బ్యాంకు నుంచి 40లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. సొంతంగా మరో 10 లక్షలు పెట్టి 50లక్షలతో వ్యాపారం మొదలుపెట్టారు. గణపవరంలో ఓ షెడ్డుని అద్దెకు తీసుకుని పరిశ్రమ ప్రారంభించారు. స్థానిక మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించారు. మొదట్లో బట్ట సంచులకు డిమాండ్‌ లేని రోజుల్లో మాస్కులు, పీపీఈ కిట్లు కుట్టి సరఫరా చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధం ప్రకటించటంతో వస్త్రాలతో తయారైన సంచులకు డిమాండ్ పెరిగింది.

తక్కువ ధరలో నాణ్యమైన సంచులు అందించి స్వల్పకాలంలోనే మార్కెట్లో వీరు పేరు సంపాదించారు. తొలుత గుంటూరు జిల్లాకే పరిమితమైనా క్రమంగా తిరుమల సహా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కూడా కొన్ని షాపింగ్ మాళ్లు ఆర్డర్లు ఇచ్చి సంచులు తీసుకెళ్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు సైతం పంపిణీ చేస్తున్నారు. కార్మికులతో పని చేయించటం, ప్యాకింగ్ వ్యవహారాలన్నీ శ్రావణి పర్యవేక్షిస్తుండగా... మార్కెటింగ్ బాధ్యతలు ఆమె భర్త మల్లిఖార్జునరావు చూసుకుంటారు.

వ్యాపారాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పుడు చొక్కాలు, క్రీడా దుస్తులు కూడా కుడుతున్నారు. తద్వారా కార్మికులకు ఎక్కువ పని దొరికింది. ప్రస్తుతం ఇక్కడ 40మందికి పైగా మహిళా కార్మికులున్నారు. సొంత ఊర్లోనే పని దొరికిందంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ఇళ్లలోనే ఇలాంటి యూనిట్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తే ప్రజలు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వినియోగం నిలిపివేసే అవకాశముంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరగటంతో పాటు వేల మందికి ఉపాధి లభిస్తుంది.

సంచుల తయారీతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్న శ్రావణి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details