Allegations on Macherla Circle Inspector: తన బిడ్డను కాపాడాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. సీఐ లంచం అడుగుతున్నారని ఓ మహిళ వాపోయింది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలని కోరింది. సీఐ.. తన కుమారుడిపై గంజాయి కేసు పెడతానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామానికి చెందిన సూదిబోయిన పద్మ అనే మహిళ సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చించి. తన కుమారుడు సూదిబోయిన ఏసుబాబును దొంగతనం కేసులో అనుమానితునిగా మాచర్ల పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది. తన కుమారుడిని కేసు నుంచి తప్పించాలంటే.. మాచర్ల సీఐ డబ్బులు అడుగుతున్నాడని ఆమె ఆరోపించింది.
బాధితురాలు పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన వెల్దుర్తి మండలం గుడిపాటి చెరువు గ్రామంలో చింతలకొండ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని వివరించింది. దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో నలుగురిని మాచర్ల పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది. వారిలో తన కుమారుడు సూదిబోయిన ఏసుబాబు ఉన్నాడని వివరించింది.