ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నబోతోన్న గ్రామాలు.. ఆర్థికంగా విలవిల.. దిక్కుతోచని స్థితిలో సర్పంచులు - దిక్కుతోచని స్థితిలో సర్పంచులు

Villages Situations In Ap: రాష్ట్రంలో గ్రామాల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం దెబ్బకు ఆర్థికంగా విలవిలాడుతున్నాయి. దీంతో గ్రామ సర్పంచులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాల బకాయిలు, పాడైన తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు నిధుల కొరత, బ్లీచింగ్‌, సున్నం, శానిటేషన్‌ సామగ్రి కొనేందుకూ కూడా పైసలు ఉండట్లేదు. అంతే కాకుండా తాజాగా కురుస్తున్న వర్షాలతో.. తలెత్తుతున్న పారిశుద్ధ్య సమస్య, నీటి కాలుష్యం, అంటు వ్యాధులు పంచాయతీలకు పెను సవాలుగా తయారవుతున్నాయి.

villages situation in ap
villages situation in ap

By

Published : Jul 24, 2022, 4:07 AM IST

Villages Situations In Ap: ఖాతాల్లో కనిపించకుండా పోయిన నిధుల కోసం ఎదురు చూపులు, సిబ్బంది, కార్మికుల జీతాలకూ సరిపోని పన్నుల ఆదాయం.. స్థూలంగా ఇదీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలతో తలెత్తుతున్న పారిశుద్ధ్య సమస్య, నీటి కాలుష్యం, అంటు వ్యాధులు పంచాయతీలకు పెను సవాలుగా తయారవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు జీతాల బకాయిలు, పాడైన తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు నిధుల కొరత, బ్లీచింగ్‌, సున్నం, శానిటేషన్‌ సామగ్రి కొనేందుకూ పైసల్లేవు. దీంతో చుట్టుముడుతున్న సమస్యలు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో పైపులైన్లలోకి చేరిన మురుగు నీరు తాగిన వారిలో ముగ్గురు మరణించారు. మరో 100 మంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు. రాష్ట్రంలో పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుంది.

నిధుల మళ్లింపుతో మొదలైన కష్టాలు
గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడంతో మొదలైన సమస్య నుంచి పంచాయతీలు ఇప్పటికీ బయటపడలేదు. దాదాపు రూ.1,245 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. తర్వాత రావాల్సిన నిధులేవీ విడుదల కాలేదు. దీంతో పంచాయతీ ఖాతాల్లో మిగులు నిధులు రూ.లక్షల నుంచి రూ.వేలకు తగ్గాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్థికసంఘం నిధులే ఆధారమయ్యేవి. ఏడాదిన్నరగా నిధుల్లేక పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. సాధారణనిధులు జీతాలకే సరిపోవడంతో.. కాలుష్య నివారణ చర్యలను పంచాయతీలు చేపట్టలేకపోతున్నాయి.

ఎటు చూసినా సమస్యలే:గ్రామాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హరిత రాయబారులకు 6 నెలలుగా జీతాలివ్వాలి. అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పంచాయతీల్లో 9-12 నెలల జీతాలు బకాయిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18వేల మంది సేవలందిస్తున్నారు. వీరు కాక... గ్రామాల్లో రహదారులు, కాలువలు శుభ్రం చేసే 25వేల మంది కార్మికులకు 5-8 నెలల జీతాలు చెల్లించాలి. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది.

  • గ్రామాల్లో దోమల నియంత్రణ కోసం పంచాయతీలకు కేటాయించిన 13,500 ఫాగింగ్‌ యంత్రాలు చాలాచోట్ల వినియోగంలో లేవు. వీటికి ఇంధనం కొనలేక.. 70-80% యంత్రాలు మూలనపడ్డాయి.
  • రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ పంచాయతీల్లో అంతంతమాత్రంగా ఉంటోంది. దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేయడం, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు శుభ్రం చేయించడంలాంటి కీలక బాధ్యతలను సమర్థంగా చేపట్టడం లేదు. చాలాచోట్ల నిధుల లేమి.. నిధులున్న చోట పనులు చేయించినా బిల్లులు వెంటనే వస్తాయో, రావో తెలియని పరిస్థితి.
  • నీటి నమూనాల సేకరణ, కాలుష్య కారక సమస్యల పరిష్కార చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. సిబ్బంది ప్రతి గ్రామంలో ఏడాదికి రెండుసార్లు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయిస్తారు. ఫలితాలు వెలువడ్డాక తీసుకోవాల్సిన చర్యలపై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు చాలాచోట్ల మీనమేషాలు లెక్కిస్తున్నారు.

నిలిచిపోయిన ప్రభుత్వ సాయం:పంచాయతీలకు ప్రభుత్వం నుంచి పలు పద్దుల కింద రావాల్సిన నిధులు ఈ ఏడాదిలో ఇంకా విడుదలకాలేదు. రూ.4 చొప్పున ఇవ్వాల్సిన తలసరి గ్రాంటు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ వాటా తదితర పన్నులు పంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జమ కాలేదు. 3, 4 రాష్ట్ర ఆర్థిక సంఘాలు సిఫార్సు చేసిన నిధులనూ కేటాయించలేదు.

ఇదీ చదవండి:'ముందుచూపు లేక ముంచేశారు.. వరద సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం'

ABOUT THE AUTHOR

...view details