Villages Face Severe Water Shortage:కుగ్రామంగా మారిన ఈ అధునాతన సాంకేతిక యుగంలోనూ.. దాహమేస్తే గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు చూసే వారున్నారంటే నమ్ముతారా? ఒక వేళ ఉన్నా ఇంతంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది ఏ ఏడారి ప్రాంతంలో నివసిస్తున్నవారో అనుకుంటే.. అది మన తప్పు కాదు. కానీ తాగునీటి కోసం కటకటలాడుతున్న ఈ పల్లెలు ఉన్నది, నాగార్జున సాగర్ కుడి కాలువకు కూతవేటు దూరంలోనే అంది. అయినా ఏంటీ దుస్థితి అనుకుంటున్నారా... అదే మన పాలకుల సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యం. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నా... ఏ మాత్రం నివారణ చర్యలపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల సహా పలు గ్రామాల్లో చిన్నా, పెద్దా, ముసలి, ముతక తాగునీరు లేక మూడు, నాలుగు నెలలుగా... పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు
తాగునీరు దొరక్క గిరిజనుల గొంతెడుతోంది. సుమారు 3 నెలల నుంచి నీటి సరఫరా జరగక.. అల్లాడిపోతున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలాన్ని మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సీఎం జగన్ వినుకొండ పర్యటించినపుడు.. సాగర్ కాల్వ నుంచి పైపులైన్ ద్వారా బొల్లాపల్లిచెరువుకు నీళ్లు సరఫరా చేసేందుకు సీపీడబ్ల్యూసీ కింద 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తునట్లు ఘనంగా ప్రకటించారు. ఈ పథకం పూర్తయితే మండలంలోని 20 గ్రామాలకు తాగునీటి సమస్య తీరినట్లేనని... ప్రజలు సంబరపడ్డారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరుతుందని భావించారు. కానీ రోజులు కాదు నెలలు గడుస్తున్నా... నేటికీ పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.