Venkayya Naidu: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, ఇతర అధికారులు హాజరై ఆయా సంస్థల పురోగతిని వివరించారు. వీటితోపాటు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సొంతభవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో స్థలం కేటాయించిన నేపథ్యంలో దాని నిర్మాణానికి నిధుల కేటాయింపు గురించి ఉపరాష్ట్రపతి ఆరాతీశారు.
అలాగే నెల్లూరులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌కు చెందిన ప్రాంతీయ కేంద్రం, రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు గురించీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఉపరాష్ట్రపతితో సమావేశమై వీటిపై చర్చించారు. ఆ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చి పూర్తి వివరాలను అందించారు. అనంతరం వెంకయ్య నాయుడు పార్లమెంటులోని తన ఛాంబర్‌లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌లతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
వివిధ సంస్థల పురోగతి ఇలా..
కేంద్ర విశ్వవిద్యాలయం: అనంతపురం జిల్లాలో కేటాయించిన 491.30 ఎకరాల భూమిని 2020లో యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది. భవనాల నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనులశాఖకు అప్పగించింది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 11 కోర్సుల్లో 414 మంది విద్యార్థులు చదువుతున్నారు.
గిరిజన విశ్వవిద్యాలయం: తాత్కాలిక భవనాల్లో 8 కోర్సుల్లో 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూమిని బదిలీ చేయాలని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. అది అయ్యాక భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. గత నాలుగేళ్లలో కేంద్రం దీని కోసం రూ.15.39 కోట్లు విడుదల చేసింది.
ఐఐటీ తిరుపతి:2015 ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1,249 మంది విద్యార్థులున్నారు. ఇప్పటివరకూ 3 బ్యాచ్‌లు బయటికెళ్లాయి. 548 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులకు సరిపడేలా క్యాంపస్ నిర్మాణాన్ని 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం.
ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెం: ఇది పూర్తిస్థాయి శాశ్వత ప్రాంగణంలో నడుస్తోంది.