చోళుల కాలంనాటి శిల్పకళా శైలితో వేదవ్యాస జ్ఞాన మందిరం నిర్మాణం.. ఎక్కడంటే.! Vedavyasa Jnana Mandir: వంపుసొంపుల కృష్ణమ్మ సోయగాలు ఓవైపు... పచ్చని పంటపొలాలు మరోవైపు.. ఈ రెండింటి నడుమ చోళుల కాలం నాటి శిల్పకళా శైలితో.. యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన అద్భుత మందిరమే వ్యాసభగవానుడి సనాతన ధర్మక్షేత్రం. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో భవఘ్ని ఆరామం ఆధ్వర్యంలో ఈ వేదవ్యాస ఆలయం రూపుదిద్దుకుంది. వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
మూడు అంతస్థుల వేదవ్యాస సనాతన ఆలయాన్ని అద్భుతమైన శిల్పకళా సంపదతో అందరిని ఆకట్టుకునేలా మలిచారు. గర్భాలయ దివ్య విమానగోపురం 90 అడుగుల ఎత్తులో ఉండగా.. వ్యాస మహామునితో పాటు ఆయన కుమారుడు శుక మహర్షి, ప్రియశిష్యులు శూత మహర్షి విగ్రహాలను నెలకొల్పారు. వ్యాస మహర్షి జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించే డాక్యుమెంటరీని భారతీయ భాషల్లో ప్రదర్శించేందుకు థియేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు.
మొదటి అంతస్థులో 12 టన్నుల బరువుండే 11 అడుగుల వ్యాస భగవానుల శిలా విగ్రహాన్ని ఆలయ నిర్మాణానికే ముందే బింభ ప్రతిష్ట చేశారు. మూడో అంతస్తులో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నాలుగు స్థూపాలు ఏర్పాటు చేసి.. మధ్యలో జ్యోతి మందిరం నిర్మించారు. అఖండజ్యోతి వద్ద నిల్చుని వేదవ్యాస దర్శనం చేసుకునేలా తీర్చిదిద్దారు. వేదవ్యాసుడి ఆలయాన్ని చూసిన భక్తులు, సందర్శకులు అనిర్వచనీయ అనుభూతుల్ని సొంతం చేసుకుంటున్నారు.
ఆలయ నిర్మాణంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యులయ్యారు. వేదవ్యాస సేవాదళం సభ్యులు.. ప్రతి గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేసి లక్ష్మన్నర ఇటుకల సేకరణతో దేశంలోని పవిత్ర నదీ జలాలతో ఈ సనాతన ధర్మక్షేత్రాన్ని పూర్తి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, మహాకుంభాభిషేకం జరగనున్నాయి. వైకుంఠపురం పర్వతాలపై పూర్వం మహర్షులు, మహాత్ములు తపస్సు ఆచరించి జ్ఞానసిద్ధి పొంది జ్ఞానాన్ని తమ శిష్యులకు అందించినట్లు.. బౌద్ధభిక్షువులు ఇక్కడ నివసించి బౌద్ధ ధర్మాలను ఆచరించి జ్ఞానోదయం పొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఇవీ చదవండి: