టీడీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పు.. వీళ్లసలు మనుషులేనా అంటూ చంద్రబాబు ధ్వజం TDP Activist Tractor Burnt : తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన ట్రాక్టర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. కారంపూడి మండలంలోని మిర్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాడు మిర్యాల గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని గ్రామ టీడీపీ నేత బత్తుల ఆవులయ్య తన ట్రాక్టర్‌పై ర్యాలీగా తీసుకొచ్చారు. ఊరేగింపు అనంతరం ట్రాక్టర్‌ను గ్రామంలోని చెరువు కట్ట వద్ద నిలిపి ఉంచారు. అర్ధరాత్రి వేళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ పోసి ట్రాక్టర్‌ను తగలబెట్టారు. గమనించిన పరిసర ప్రాంత ప్రజలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ కార్యకర్తల పనే అయి ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మండిపడ్డారు.
వైసీపీ సైకోలకు కళ్లముందే ఓటమి భవిష్యత్తు: పల్నాడులో టీడీపీ ఇంఛార్జిని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా తెచ్చారని దాన్ని తగలబెట్టడం నీచమైన చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వీళ్లసలు మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం లేచింది మొదలు తగలబెట్టడం, పగలగొట్టడం ఇదే పనా అంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సైకోలకు కళ్ల ముందు భవిష్యత్ ఓటమి కనిపించడమే ఈ ఫ్రస్ట్రేషన్‌కు కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడే రోజులు దగ్గర్లో ఉన్నాయి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు ప్రజల పాలిట రాహు కేతువులుగా మారారని టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. కారంపూడి మండలం మిర్యాలలో బీసీలు తనను ఓ కార్యక్రమానికి పిలిస్తే వెళ్లానని.. అక్కడ తనను ఊరేగించిన ట్రాక్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు తగులబెట్టారని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలను పీల్చుకుని ఆస్తులు పోగేసుకోవడం తప్ప పిన్నెల్లి సోదరులకు ఇంకేం తెలియదని వ్యాఖ్యానించారు. బీసీలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని విమర్శించారు. మాచర్లలో వైఎస్సార్సీపీ సామాజికవర్గ న్యాయం ఎక్కువైందని.. ఇతర కులాలు, మతాల వారిపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. చంద్రయ్య, జల్లయ్య హత్యలే అందుకు నిదర్శనమన్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్టపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఇవీ చదవండి: