పల్నాడు జిల్లా:మాచవరంలో కొమ్మినేని శ్రీ రాములు (40 )అనే వ్యక్తి దారుణ హత్యకి గురైయ్యాడు. మాచవరం కోట్ల బజారు సమీపంలో ఈ ఘటన జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేపట్టారు. హత్య కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
* పల్నాడు జిల్లాలోని మద్యం దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నకరికల్లు మండలం చల్లగుండ్లలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్థరాత్రి సమయంలో చోరీ జరిగింది. దుకాణం పై కప్పు తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించిన దుండగులు... లాకర్లోని రూ.9.4 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి... ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారమందించారు. ఎక్సైజ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు నకరికల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీతో పాట ఎక్సైజ్ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
కర్నూలు జిల్లా: శ్రీశైల దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న నాగమల్లిపై స్థానిక మేకల బండకు చెందిన చెంచు శేఖర్ అనే యువకుడు దాడి చేశారు. ఇంట్లో ఉన్న నాగమల్లిపై.. చెంచు శేఖర్ కత్తితో దాడి చేయగా.. మెడ, పొట్ట భాగంపై స్వల్పగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దాడికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ఆర్టీసీ బస్సు, ట్రక్ ఆటో ఢీకొన్నాయి. బస్సును ఢీకొట్టిన ఆటో బోల్తా పడటంతో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలిపోయాయి. రోడ్డుపైన పెద్దఎత్తున గాజు ముక్కలు పడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్‌పై అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. గాయపడిన డ్రైవర్‌ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
*విజయవాడ అజిత్ సింగ్‌నగర్ పాయకాపురం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
లిఫ్టు కేబుల్ తెగి అయిదుగురికి తీవ్ర గాయాలు..కాకినాడలోని ఓ కల్యాణ మండపంలో ఉన్న లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అశోక్‌నగర్ ఉన్న వెంకన్నబాబు కల్యాణ మండపంలో మూడో అంతస్తులో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకకు కొందరు వెళ్లారు. రాత్రి ఇంటికి వెళ్లేందుకు కాకినాడ గ్రామీణం, ఇంద్రపాలేనికి చెందిన రాయిప్రోలు శ్రీరామచంద్రమూర్తి(74), భార్య సూర్య భానుమతి(72), అల్లుడు భాస్కర్(52), కూతురు సూర్యత్రిపుర స్వప్న(37), మనవరాలు శ్రీనిజ(8) లిఫ్ట్‌లోకి ఎక్కారు. వీరితోపాటు కొందరు ఉన్నట్లు సమాచారం.
గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే క్రమంలో లిఫ్ట్ కేబుల్ తెగిపోయి.. వేగంగా కిందికి పడిపోవడంతో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందర్నీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వారి కాళ్లకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ సామర్థ్యం ఎనిమిది మందికే పరిమితం కాగా.. 12 మంది ఎక్కడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లా:సంగం మండలం కోలగట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్లే ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. లారీ డ్రైవర్‌కి, బస్సు డ్రైవర్‌కి తీవ్రంగా గాయలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.