వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా: జీవీ ఆంజనేయులు TDP leader GV Anjaneyu fire on YCP MLA Brahmanaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పార్టీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ గ్రానైట్ వ్యాపారాలు చేస్తూ.. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. అంతేకాదు, బడుగు బలహీనవర్గాలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూముల్ని, పోరంబోకు భూముల్ని అక్రమించి.. కోళ్ల వ్యాపారాలు, ఆవుల ఫారాలు నిర్మించుకుంటున్నారు.
ప్రభుత్వ భూముల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలు..ఈ క్రమంలోఅక్రమాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ.. ప్రతిపక్ష నేతలు, స్థానికులు ప్రశ్నించగా.. పోలీసుల చేత బలవంతపు కేసులు పెట్టించి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా మట్టి దోపిడీ చేస్తున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ నేత జీవీ ఆంజనేయులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్రమ తవ్వకాలు జరిగిన భూముల్లోకి వెళ్లి, నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసే పన్నాగానికి తెరలేపగా.. టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. తప్పుడు కేసులకు భయపడేదని తేల్పి చెప్పారు.
తప్పుడు కేసులకు టీడీపీ తలొగ్గదు.. తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వినుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి మట్టి దోపిడీని భయటపెట్టాననే అక్కసుతో తనపై, తన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారనిజీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. వెంకుపాలెంలోని సర్వే నెంబర్-1 కొండ పోరంబోకు ప్రభుత్వ భూమి నుంచి ఎమ్మెల్యే బొల్లా ఆవుల ఫారానికి వేల ట్రక్కుల మట్టిని అక్రమంగా తరలించుకు వెళ్లారని ఆరోపించారు. ఇటీవల తాను, పార్టీ కార్యకర్తలు అక్రమ తవ్వకాలు జరిగిన భూముల్లోకి వెళ్లి.. నిరసన చేపట్టి, మీడియాకు చూపించామన్నారు. దీనికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారని ఆగ్రహించారు. తప్పుడు కేసులకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
''వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి ఫ్యాక్టరీలోకి గానీ, అతని భూముల్లోకి గానీ మేము వెళ్లలేదు. నిరసన తెలిపిన రోజున సీసీ కెమెరాలు, పాత్రికేయులు, ప్రజలు అందరూ అక్కడే ఉన్నారు. నట్లు, బోల్టులు పోయాయని.. వాటిని జీవి ఆంజనేయులు, టీడీపీ నాయకులు తీసుకువెళ్లారంటూ మాపై నీచమైన ఆలోచనలతో ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించడం దుర్మార్గం. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. అనేక అవినీతి, అక్రమాలు, భూ దందాలకు పాల్పడుతున్నాడు. అతని అవినీతి చరిత్రను త్వరలోనే ప్రజల్లోకి తీసుకెళ్తాం. బ్రహ్మనాయుడి ఒత్తిళ్లకు లోనై, పోలీసులు మాపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరికాదు. బ్రహ్మనాయుడి అహంకారాన్ని, అవినీతిని, అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో అతన్ని నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడం ఖాయం.''- జీవీ ఆంజనేయులు, టీడీపీ అధ్యక్షులు