6 thousand crores loan: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు రుణాల ద్వారా సమీకరించుకొంది. 2022-23లో వాస్తవానికి రూ.55 వేల కోట్లను ఎఫ్ఆర్బీఎమ్కు లోబడి అప్పుగా తీసుకోవాలని సర్కార్ భావించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే బడ్జెటేతర అప్పుల విషయమై అభ్యంతరం తెలిపిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అప్పు మొత్తానికి అనుమతి ఇవ్వలేదు.
గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న బడ్జెటేతర రుణాల మొత్తాన్ని నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్ఆర్బీఎమ్ అప్పుల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.14 వేల కోట్ల మేర కుదించింది. దీంతో మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా సమీకరించుకుంటోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి.