వినుకొండలో వైసీపీ నేతల రౌడీయిజాన్ని పోలీసులే ప్రోత్సహించారు Vinukonda Issue: పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నేతల రౌడీయిజాన్ని పోలీసులే ప్రోత్సహించారని తెలుగుదేశం ఆరోపించింది. వైసీపీ సైకోలకు లాఠీలు ఇచ్చి మరీ తెలుగుదేశం వాళ్లను కొట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు చేతుల్లో నుంచి వైసీపీ కార్యకర్త లాఠీ లాక్కుని దాడి చేసేందుకు పరుగులు తీస్తున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదీ జరిగింది.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొండ పోరంబోకులో అక్రమంగా మట్టి తరలించారంటూ ఈ నెల 24న టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆందోళన చేపట్టారు. అయితే జీవీ ఆంజనేయులు సహా పలువురు టీడీపీ నేతలు.. తన ఫారంలోకి వచ్చి కాపలాదారులపై దౌర్జన్యాలకు పాల్పడి విలువైన వస్తులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీవీ ఆంజనేయులు సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. తమపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు పట్టణంలో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ కార్యకర్తల ర్యాలీ జీవాలయం వద్దకు వచ్చేసరికి బొల్లాపల్లి వెళ్లేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అటుగా వచ్చారు.
ఆయన కారు అద్దం దించి.. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, దమ్మున్న మొనగాడెవరో రావాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా కారు డోరు తీసి నిలబడి టీడీపీ నాయకులను దూషించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కోపంతో కేకలు వేశారు. కొంత సమయం తర్వాత ఎమ్మెల్యేకు దారి ఇచ్చినా వెళ్లకుండా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆయన అక్కడే ఆగి వైసీపీ కార్యకర్తలను పిలిపించారు. పోలీసులు చెప్పినా వినకుండా రెండున్నర గంటలసేపు రోడ్డుపైనే కారులో కూర్చొని ప్రతిపక్ష కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గురువారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఓ పక్క అధికార పార్టీ కార్యకర్తలు, మరోవైపు ప్రతిపక్ష శ్రేణులు.. పెద్ద ఎత్తున మోహరించి గొడవ పడటంతో స్థానిక ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలో రెండు గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లు ఏది దొరికితే అది విసురుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుడంతో పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఏకపక్షంగా టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జీకి దిగారు. అక్కడే గుంపుగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా కర్రలతో బస్టాండులోకి వెళ్లి టీడీపీ కార్యకర్తలను దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. పోలీసులు వారిని అదుపు చేయకుండా టీడీపీ కార్యకర్తలపైనే లాఠీఛార్జి చేశారు. గొడవను నివారించడంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు.. చివరకు టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టడానికే పరిమితం కావడం విమర్శలకు దారితీసింది.