ఉంగుటూరులో అధికార పార్టీ అరాచకం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు యత్నం TDP Symphysis Votes Removing in Unguturu :విధ్వంస పాలనతో మరోమారు అధికారంలోకి రావడం కష్టమని గుర్తించిన అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష ఓటర్ల తొలగింపే లక్ష్యంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సానుభూతిపరులు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు తీసేందుకు యత్నిస్తున్నారని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అత్తలూరులో 130 మందికి, ఉంగుటూరులో 83 మందికి స్థానికంగా ఉండటం లేదంటూ ఓట్లు తొలగించేందుకు బీఎల్వోలు, వీఆర్వోలతో నోటీసులు ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణగా పేర్కొంటున్నారు. కనీసం ప్రాథమిక విచారణ జరపకుండా కేవలం వైకాపా నేతలు ఇచ్చిన జాబితా ఆధారంగా బీఎల్వోలు, నోటీసులు ఇస్తున్నారని బాధిత ఓటర్లు ఆరోపిస్తున్నారు.
Palnadu District Fake Votes :గ్రామంలో నివాసం ఉండని కారణంగా ఓట్లు తొలగించాలని బీఎల్వోలు ఇచ్చిన సమాచారం మేరకు వీఆర్వోలు తమకు సెక్షన్ 22 కింద ఓట్లు తొలగించేందుకు నోటీసులు పంపారని ఉంగుటూరు గ్రామానికి చెందిన యలమంచిలి శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఈ గ్రామంలోనే ఉంటున్నామని, ఆధార్, రేషన్, ఓటర్ ఐడీ అని ఈ చిరునామాతోనే ఉన్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు కడుతున్నామని స్పష్టం చేశారు. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా కట్టించుకుంటున్న అధికారులు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదని చెప్పి ఎలా ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తారని నిలదీస్తున్నారు.
ఇంటి నంబర్ లేకుండానే ఓట్లు, మృతులకూ జాబితాల్లో చోటు-న్యాయపోరాటం చేస్తామంటున్న విపక్షాలు
Fake Votes in AP :గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలోనూ తమ ఓట్లు కక్షపూరితంగా తొలగించారని, న్యాయస్థానానికి వెళ్లి ఓటు హక్కు సాధించుకున్నామని వెల్లడించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావాలనే అధికారులతో కలిసి ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Irregularities in Andhra Pradesh voter list 2023 :50 ఏళ్లకుపైగా ఉంగుటూరులోనే ఉంటున్నామని, పిల్లలు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇక్కడే నివసిస్తున్నట్లు వేదగిరి రాజ్యలక్ష్మీ అనే మహిళ తెలిపారు. పుట్టినిల్లు, మెట్టినిల్లు ఇదే కావడంతో ఓటు హక్కు కూడా ఇక్కడే ఉందని, అలాంటి తన ఓటును తొలగిస్తున్నామని అధికారులు నోటీసులు ఎలా పంపిస్తారని ఆమె ప్రశ్నించారు. తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీల మీద పలు ప్రాంతాలకు వెళ్లుతూ ఉంటామని గ్రామానికి చెందిన చిన్నం పుప్పాంజలి తెలిపారు. ఇప్పటి వరకూ అనేక పట్టణాల్లో పని చేసినా తమ ఓటు, ఆధార్, ఆస్తులు అని కూడా ఉంగుటూరులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు తొలగింపునకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.
కొత్తపేటలో ఓట్లు తొలగించడానికి మరో ఎత్తుగడ - స్థానికంగా లేరంటా 4 వేల మందికి పైగా నోటీసులు
Enrolling Fake Votes In Voter List :వైసీపీ నేతలకు ఓటు వేయమని ఒకే ఒక్క కారణంతో ఇప్పటికే నాలుగుసార్లు తమఓట్లు తొలగించారని యలమంచిలి రామాంజనేయులు అన్నారు. జాబితా నుంచి పేర్లు తొలగించిన ప్రతిసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ ఓటు హక్కును తిరిగి సంపాదించుకున్నామన్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఓట్ల తొలగింపు అక్రమాలకు తెర లేపారని, తాము బతికే ఉన్నట్లు ఎన్నిసార్లు నిరూపించుకోవాలని మండిపడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 83 మంది ఓట్లు తొలగించడం అన్యాయమని ఉంగుటూరు మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించటమే లక్ష్యంగా పావులు కలుపుతున్న వైసీపీ నేతలకు స్థానిక అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడే నివాసం ఉంటున్న తన ఇద్దరు కుమార్తెల ఓట్లను తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం పట్ల గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
Andhra Pradesh voter list 2023 :ఓటు హక్కు తొలగించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న గ్రామ, మండల స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఉంగుటూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడమని ఉంగుటూరు గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
అధికారపార్టీ ఓట్ల దొంగలను రక్షిస్తున్న పోలీసులు - అర్హుల ఓట్ల తొలగింపునకు వైసీపీ సానుభూతిపరుల దరఖాస్తులు