TDP Leaders Demanding Compensation to Farmers: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేెశారు. సమావేశంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పంట నష్టం అంచనాలు వేయమని అధికారులకు ఆదేశాలిచ్చినా పట్టించుకున్న నాథుడు లేడని దుయ్యబట్టారు. నెల రోజుల తరువాత అధికారులు పంట నష్టం అంచనా వేసినా.. నష్టం ఎంత జరిగిందో తెలిసే అవకాశం ఉండదన్నారు. ఏ పంటకు ఎంత న్యాయం చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులు అప్పు ఎలా తీర్చాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్నారన్నారు.
రైతు లేకపోతే రాజ్యమే లేదన్న జగన్మోహనరెడ్డి ఇప్పుడు రైతును ఎందుకు దగా చేస్తున్నారో చెప్పాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి రజని పంటనష్టంపై ఎందుకు పర్యటన చేశారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి పర్యటన వలన రైతులకు ఒరిగిందేమిటని ప్రశ్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలెక్టర్లను వెంటబెట్టుకుని పంట నష్టంపై పర్యటించి వెంటనే పరిహారం ప్రకటించారన్నారు. రైతుకు జరిగిన నష్టంపైన మంత్రి రజని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకు వచ్చి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
అదే విధంగా డ్రగ్స్, గంజాయికి దేశంలోని 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉందన్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఒక కాంట్రాక్టు కార్మికుని వద్ద గంజాయి పట్టుకున్నారన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్లపై 11 కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.