Gambling in Chilakaluripeta : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాసులు కురిపిస్తున్న పేకాట కేంద్రాలు :మంత్రి విడదల రజిని అండదండలతో ఆమె కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జూదం లేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డిప్రగల్బాలు పలికారని, జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలకు పేకాట కేంద్రాలు కాసుల కురిపిస్తున్నాయని అన్నారు. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్ర స్థానంలో ఉంటుందని, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.
పేకాట అడ్డాగా చిలకలూరిపేట :సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేసి అనధికారికంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చిలకలూరిపేటను పేకాటకు అడ్డాగా మార్చారని.. అపార్ట్‌మెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని అన్నారు. మంత్రి విడదల రజిని సహకారంతోనే యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారని, 'మూడు పువ్వులు... ఆరు కాయలు'గా.. పేకాటను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేటలో జూదం ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని... పేకాట క్లబ్‌ల ద్వారా మంత్రి రజిని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. అనధికారికంగా పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.