Opportunity to Study While Working: ఇంటర్ పూర్తయిన విద్యార్థులూ ఇక సాఫ్ట్‌వేర్ కొలువులు చేయొచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. ప్రతి సంవత్సరం 20 వేల మంది ఇంటర్ విద్యార్థులను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల్లోకి తీసుకోనుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆ కంపెనీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో గురువారం మంత్రి తన కార్యాలయంలో సమీక్షించారు.
ఒక సబ్జెక్టుగా గణితం చదివిన వారే అర్హులు:సాఫ్ట్‌వేర్ కొలువులకు ఎంపిక కావాలంటే ఇంటర్మీడియట్‌లో ఒక సబ్జెక్టుగా గణితం చదవడం తప్పనిసరి. అంటే ఎంపీసీ, ఎంఈసీ గ్రూపుల విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే. వారికి ఫిబ్రవరిలో ఆన్‌లైన్ పరీక్షను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిర్వహిస్తుంది. దాన్ని హెచ్‌సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్టు (క్యాట్)గా పిలుస్తారు. గణితం, లాజికల్ రీజనింగ్, ఆంగ్లానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో 60 శాతం మార్కులు సాధించిన వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలలపాటు కంపెనీ ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తుంది. అప్పుడు విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పనిచేయాలి. ఈ శిక్షణ పూర్తయిన వారికి హెచ్‌సీఎల్ కార్యాలయాల్లో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.10 వేల చొప్పున స్టయిపండ్ అందిస్తారు. అది పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.2.50 లక్షల వేతనంపై పూర్తిస్థాయిలో ఉద్యోగంలో చేర్చుకుంటారని మంత్రి తెలిపారు. అనుభవం పెరుగుతున్న కొద్దీ వేతనం కూడా పెంచుతారని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని అన్నారు.