Road Accidents In State : లారీ, కారు ఢీ కొని ఇద్దరు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణా పురం సమీపంలోని నందిగామ వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలను సేకరించారు. మృతులు సత్తెనపల్లి కి చెందిన రాజ్యలక్ష్మి, సురేష్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కారు సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా నందిగామ వద్దకు రాగా ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మి అనే మహిళతో పాటు ఆమె మేనల్లుడు సురేష్ కారులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాజ్యలక్ష్మి సత్తెనపల్లి మండలంలోని కొమెరపూడి జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయురాలు కాగా ఆమె మేనల్లుడు సురేష్‌గా గుర్తించారు. ప్రతిరోజూ సత్తెనపల్లి నుంచి రాజ్యలక్ష్మి ని హైస్కూలులో వదిలిపెట్టి సాయంత్రం మేనల్లుడు సురేష్ కారులో తీసుకువస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం హైస్కూల్ కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకరు మృతి :బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం ఇటుక బట్టీల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీస్ వాహనం దర్శి నుంచి విజయవాడ వైపు వెళుతోంది. ఎదురుగా తణుకు నుంచి గోవా వెళుతున్న కంటైనర్‌ని ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఐ రోశయ్య ఎస్సై ప్రవీణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వాహన చోదకుడు విజయవాడకు చెందిన అనుపోజి రాంబాబు (48) గా గుర్తించారు. ప్రమాదానికి నిద్ర మత్తు కారణం అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..ఆరుగురికి గాయాలు - Road accident in Nellore
Road Accidents In State : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.
ఆరుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం : నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవి పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. నరుకూరు నుంచి డేవిస్ పేట వైపు కూలీలతో వెళ్తున్న ఆటో జగదేవి పేట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఇందుకూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి