NarasaRaopet RTC Bus Stand: పల్నాడు జిల్లా నరసరావుపేటలో పలువురి ఫిర్యాదుల మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని శనివారం తెల్లవారుజామున చేపట్టారు. ఆక్రమణల తొలగింపుతో దుకాణ దారులు తమ జీవనోపాధి పోతుందని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
దీనితో మున్సిపల్ అధికారులు ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చి వారి సహకారంతో ఆక్రమణల దుకాణాలను ప్రొక్లెయినర్ ద్వారా తొలగించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థలాలను ఆక్రమించి కొందరు వ్యక్తులు దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకోవడంతో రవాణాకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసుకున్న ఐదు దుకాణాలను శనివారం తెల్లవారుజామున తొలగించామన్నారు. అదేవిధంగా పట్టణంలో మరి కొన్ని రద్దీ ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు తొలగించాల్సి ఉందన్నారు.