Illegal Sand Mining in Palnadu: పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికార పార్టీ, భారతీయ జనత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పల్నాడు పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఇసుక రీచ్ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిని కాకుండా.. అక్రమాలపై ప్రశ్నించే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వీర్రాజు మండిపడ్డారు.
రహదారిపై బైఠాయించిన వీర్రాజు పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని, ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ఇసుక రీచ్ లను పరిశీలించేందుకు వచ్చిన వీర్రాజును వైకుంఠపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కొంతసేపు వీర్రాజు రహదారిపై బైఠాయించారు. ఇసుక రీచ్లకు వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మిషన్లు పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారని.. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమని చెప్పారు. ఇసుక పాలసీతో ప్రజలు నష్టపోతున్నారని... గుత్తేదారులు రేయింబవళ్లు ఇసుకను తవ్వి దోపిడీ చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఆ తర్వాత అమరావతిలో ఇసుక రీచ్ ను వీర్రాజు పరిశీలించారు.