ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత... పలువురి సంతాపం

Pingali Venkaiah daughter: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సీతామహాలక్ష్మి మృతికి పలువురు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Sita Mahalakshmi
సీతామహాలక్ష్మి కన్నుమూత

By

Published : Jul 22, 2022, 8:27 AM IST

Updated : Jul 22, 2022, 10:48 PM IST

Pingali Venkaiah daughter: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి పల్నాడు జిల్లా మాచర్లలో కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీతామహాలక్ష్మి కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మాచర్లలోని తన కుమారుడు నరసింహం ఇంటిలో ఆమె మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది సీఎం జగన్‌ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులను సన్మానించి రూ.75 లక్షలను అందించారు. వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సీతామహాలక్ష్మిని దిల్లీ తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె మృతి చెందడంతో విషాదం అలముకుంది.

ఘంటసాల సీతామహాలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం మాచర్లలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు.. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, ఎస్పీ రవి శంకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ శ్మశాన వాటికలో.. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

నేటి తరానికి తెలిసేలా..: స్వాతంత్య్ర సంగ్రామంలో పింగళి వెంకయ్య పాత్ర ఎనలేనిది. జాతీయ పతాకం రూపశిల్పిగా ప్రత్యేక స్థానం ఉంది.. ఆయన కూతురు సీతామహాలక్ష్మి పింగళి గొప్పదనాన్ని నేటి తరానికి తెలిసేలా ఎంతో కృషి చేశారు. నాడు తండ్రి వెన్నంటి ఉండి, ప్రత్యక్షంగా చూసిన ఆనాటి సంగతులను ఎన్నింటినో ఆమె మనకు అందించారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వచ్చే నెల 2న సత్కారం అందుకోవాల్సి ఉండగా, ఇంతలోనే సీతామహాలక్ష్మి కన్నుమూయడం తీరని విషాదం నింపింది. సీతామహాలక్ష్మి భర్త ఉగ్రనరసింహం. ఆమెకు ఆరుగురు పిల్లలు. వీరిలో ఒకరైన నరసింహం అధ్యాపకుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేసి మాచర్లలో ఉంటున్నారు. తాత పింగళి చరిత్రపై నరసింహం పుస్తకం రాశారు. స్వాతంత్య్ర కాలం నాటి అనుభవాలను తల్లి ద్వారా తెలుసుకొని పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చిన తరువాత పింగళి జీవిత విశేషాలు నేటి తరానికి ఎంతో తెలిశాయి.

సత్కారం అందుకోకుండానే:భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా గతేడాది నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సీతామహాలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులను సన్మానించేందుకు కేంద్ర సాంస్కృతిక విభాగం ఏర్పాట్లు చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడారు. దిల్లీలోని వేదిక వద్దకు సీతామహాలక్ష్మిని ప్రత్యేకంగా తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. వందేళ్ల జెండా పండగ సందర్భంగా గతేడాది మార్చి 12న సీఎం జగన్‌ మాచర్లకు వచ్చి సీతామహాలక్ష్మిని సన్మానించిన సందర్భంలో ఆమె ఉల్లాసంగా కనిపించారు. మరో సత్కారం అందుకోవాల్సిన తరుణంలో సీతామహాలక్ష్మి మృతి చెందడంతో విషాదం అలముకుంది.

సీతామహాలక్ష్మి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి సంతాపం తెలిపారు. సీతామహాలక్ష్మి మరణం బాధాకరమని తెదేపా నేత​ బుద్దప్రసాద్‌ అన్నారు. సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 22, 2022, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details