పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో తాగునీటి కష్టాలు Drinking Water Problems in Palnadu District: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వనరులు అందుబాటులోలేవు. వర్షాకాలంలో తాగునీటి కోసం.. అక్కడి ప్రజలు బొల్లాపల్లి చెరువుపై ఆధారపడతారు. కానీ.. వేసవిలో మాత్రం కిలోమీటర్ల దూరం నడిచి పొలాల్లోని వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకోవాలి.
బొల్లాపల్లితో పాటు రేమిడిచర్ల, గండిగనుమల, దోమల గుండం, గుట్టపల్లి తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా వేసవిలో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుంది. గతేడాది ట్యాంకర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో నీటి సరఫరా నిలిపివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయడు బొల్లాపల్లి చెరువును పరిశీలించి సమీపంలోని మూగచింతలపాలెం వద్ద సాగర్ కుడి కాల్వ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. 2002లో బొల్లాపల్లి మండలంలోని చప్పిడి వాగుపై టీడీపీ ప్రభుత్వం చెరువుకు అలుగు నిర్మించి అభివృద్ధి చేసి జలవనరుల శాఖకు బదిలీ చేసింది.
తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో ఈ చెరువు వెలుగులోకి వస్తోంది. సాగర్ కాల్వ నుంచి పైపులైన్ ద్వారా ఈ చెరువుకు నీళ్లు సరఫరా చేసేందుకు సీపీడబ్ల్యుసీ కింద 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తునట్లు సీఎం జగన్ ప్రకటించడంతో మండల ప్రజల్లో ఎదురుచూపులు మెుదలయ్యాయి. ఈ పథకం పూర్తయితే మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరుతుందని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చెరువు పనులను ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేస్తే.. తాగునీటి సమస్య తీరుతుందని బొల్లాపల్లి మండల ప్రజలు చెబుతున్నారు.
ఇవీ చదవండి: