Pawan made allegations against ysrcp: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలో పర్యటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 280 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు. కౌలు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఆదుకోవడానికి ముందుకు రాని వైకాపా నేతలు, అధికారులు... సినిమా టికెట్లు, వారాహి వాహనం వంటి అంశాలపై అతిగా స్పందిస్తున్నారంటూ పవన్ ఎద్దేవా చేశారు.. ఇలాంటి విధానాలు మానుకోవాలని హితవుపలికారు.
తాను ఏం మాట్లాడినా వెంటనే వైకాపాలోని కాపు నాయకులు, మంత్రుల చేత తిట్టించడం అలవాటైపోయిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనెలా తిరుగుతానో చూస్తానంటూ వైకాపా నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు. తనను వారాంతపు పొలిటీషియన్ అంటున్న వైకాపా నేతలకూ పవన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. 2014 ఎన్నికల్లోలా తెలుగుదేశంతో జనసేన కూటమిలా ఉండి పోటీచేసి ఉంటే.. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, పవన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటును చీల్చబోమన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు.
వైకాపాపై వ్యతిరేకత ఉన్న పక్షాలన్నింటినీ ఒకవైపు తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పకపోతే.. రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చూడని కులాలను అధికార పీఠం ఎక్కించడమే జనసేన లక్ష్యమన్నారు. మాచర్లలో వైకాపా విధ్వంసాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ మరిన్ని అరాచకాలకు పాల్పడబోతుందని చెప్పారు. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనసైనికులు, వీర మహిళలకు పిలుపునిచ్చారు.