Osteoporosis in Adilabad student: ఈ విద్యార్థి భవిష్యత్తును ఎముకల అరుగుదల వ్యాధి చిదిమేసింది. చిన్న వయసులోనే వ్యాధి లక్షణాలు బయటపడటంతో నడవలేక చదువుకు దూరమయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన అండ్రెడ్డి లింగారెడ్డి, పుష్పలత దంపతుల కుమారుడు లోకేష్‌రెడ్డి(19) మూడో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వైద్యునికి చూపించారు. కుడికాలులో ఎముకల బలహీనత అని చెప్పడంతో మందులు వాడారు.
అలా ఆ విద్యార్థి ఇబ్బంది పడుతూనే 8వ తరగతి వరకు చదివాడు. నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చూపించగా కీళ్లవాతంతో పాటు కుడి కాలుకు ఎముకల అరుగుదల వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉన్న రెండెకరాల భూమిని విక్రయించి వైద్యం కోసం మూడేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ అక్కడే కూలి పనులు చేస్తూ కుమారుడికి చికిత్స చేయిస్తున్నారు.