Online Fraud Committed Person Arrested:వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు.. మోసాలకు తెరలేపాడు. ఈజీ మనీ కోసం అన్లైన్ పేమెంట్ మార్గాన్నే మోసాలకు మార్గంగా ఎంచుకున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడగా.. చివరికి పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. దాదాపు రూ. 11లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామానికి చెందిన.. వేపూరి శరత్ బాబు అనే యువకుడు అన్లైన్ గేమ్‌లకు అలవాటుపడ్డాడని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలోనే విద్యను మానేసిన శరత్ బాబు.. అన్లైన్ గేమ్‌లకు బానిసగా మారినట్లు వివరించారు. ఈ క్రమంలో అతను జూదం, క్రికెట్లో బెట్టింగ్ వంటి వాటిలో నగదు అధికంగా వస్తుందని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాటిలో బెట్టింగ్‌లు పెట్టేవాడని వివరించారు. ఈ బెట్టింగ్‌ల కోసం నగదు అవసరం కావడంతో.. మోసాలకు తెరలేపినట్లు వివరించారు.
మోసం చేసే తీరు తెలిస్తే ఆశ్చర్యమే :మోసాలకు పాల్పడేందుకు అతను జనం అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడని వివరించారు. జనప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఏదైనా షాపునకు వెళ్లి.. ఆ షాప్‌లోని వస్తువులు కొనుగోలు చేసేవాడని తెలిపారు. ఈ క్రమంలో వారికి నగదు చెల్లించేందుకు.. యాజమాని ఫోన్ నుంచి ఆన్లైన్లో తనకు ఒక రూపాయి సెండ్ చేయమని అడిగేవాడని అన్నారు. వారు అతను చెప్పినట్లుగానే రూపాయి సెండ్ చేసే క్రమంలో.. పాస్‌వర్డ్‌ను గమనించేవాడని వెల్లడించారు.
యాజమాని నగదు సెండ్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకుని.. తన వాళ్లకు చేరిందో లేదో చూసుకుంటానని అడిగేవాడని తెలిపారు. ఇలా దుకాణాదారుడి ఫోన్ తీసుకునే వాడని వివరించారు. ఫోన్ తీసుకున్న తర్వాత దుకాణ యాజమాని వేరే పనిలో ఉండడాన్ని చూసి.. యాజమాని ఖాతా ఓపేన్ చేసి నగదు తనకు సెండ్ చేసుకునేవాడని పేర్కొన్నారు.