Greenery Cut down: సీఎం పర్యటన పేరుతో రాష్ట్రంలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. గతంలో గుంటూరు, విశాఖ నగరంలో చెట్ల నరికివేతపై తీవ్రవిమర్శలు వచ్చినా.. అధికారులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో దాదాపు వంద పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు తెగిపడటంపై సామాన్యులు సైతం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పర్యావరణ ప్రేమికుల్ని ఒకింత తీవ్ర మనోవ్యధకు గురిచేస్తున్నాయనే వాదన వ్యక్తమవుతోంది.
పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. చేదోడు కార్యక్రమంలో లబ్దిదారులకు మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేందుకు ఈనెల 30న సీఎం వినుకొండ వస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం హెలిపాడ్ ల్యాండింగ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు 50 చెట్లు, సభ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు. భద్రత సిబ్బంది సూచనల మేరకు తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మరియు డీఈఈ వెంకయ్య తెలిపారు.