Murikipudi Granite Mafia: అసైన్డు భూముల్లో మైనింగ్‌కు అనుమతులిచ్చారంటూ... పల్నాడు జిల్లా మురికిపూడి దళిత రైతులు న్యాయస్థానానికి వెళ్లడం కలకలం రేపింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుపేదలకు ప్రభుత్వం బీ-ఫాం పట్టాలను మంజూరు చేసింది. ఆ భూముల్లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వ యంత్రాంగం నిరభ్యంతర పత్రాలు ఎలా ఇస్తారంటూ సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో పది మంది లీజుదారులకు 50 హెక్టార్లలో గ్రానైట్ తవ్వకాలకు అధికారులు నిరభ్యంతర పత్రాలు ఇచ్చారు. వాటి ఆధారంగా మైనింగ్ లీజుకు లీజుదారులు దరఖాస్తు చేయగా 2020 చివరి నుంచి 2021 వరకూ ఎన్వోసీలు కొనసాగాయి. ఇక్కడ వ్యవసాయమే ఆధారంగా జీవించే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలు మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. పెద్దఎత్తున మైనింగ్‌కు ఎన్వోసీలు ఇవ్వడం, అందులోనూ బీ-ఫామ్ పట్టాలున్న రైతుల భూములు ఉండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకిచ్చిన భూముల్లో ఖనిజాలు ఉన్నట్లు తెలిస్తే వాటిని తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే బీ-ఫాం పట్టాదారునికి సమాచారం ఇచ్చి, వాళ్ల అంగీకారంతోనే తీసుకోవాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మురికిపూడిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని లీజుకు ఇవ్వాలి. కానీ పట్టాదారులకు చెప్పకుండా మైనింగ్ లీజుకు ఎన్వోసీ ఎలా ఇస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి, భూములు వెనక్కి తీసుకున్నాకే మైనింగ్ లీజుకు ఎన్వోసీ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.