MINISTER AMBATI: సంక్షేమ పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనా అని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన రుద్రపాటి అంజమ్మ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం ఆయన కాలనీకిరాగా... అమ్మఒడి పథకం కోసం వాలంటీరు లంచం తీసుకున్నారని, డ్వాక్రా రుణానికి రూ.2వేలు లంచం ఇచ్చానని ఆమె తెలిపారు. కాగితంపై రాసిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పడంతో అంజమ్మ ఫిర్యాదు పత్రం అందజేశారు. ‘మీరొస్తున్నారని ఈరోజే బ్లీచింగ్ చల్లారు.. రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదంటూ స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. రోజూ బ్లీచింగ్ చల్లాలా అని ఎంపీపీ భర్త రామలింగారెడ్డి గట్టిగా మాట్లాడబోగా, నువ్వు ఆగవయ్యా అంటూ మంత్రి రాంబాబు నిలువరించారు. గ్రామానికి చెందిన ఎం.లలిత తమకు రైతుభరోసా లబ్ధి అందుతూ ఆగిపోయిందని.. తాము పొలం సాగు చేస్తున్నా ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. ఆమె భర్త విద్యుత్తుశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో రైతుభరోసా నిధులు నిలిచిపోయాయని సచివాలయ ఉద్యోగి తెలిపారు.
అమ్మఒడికి లంచం అడుగుతున్నారు.. మంత్రి అంబటి ఎదుట మహిళ ఆగ్రహం - ఏపీ వార్తలు
MINISTER AMBATI: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. రోడ్లు, మురుగుకాలువలు, పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మఒడి మంజూరు చేయడానికి అధికారులు లంచం అడుగుతున్నారని మంత్రి అంబటిని నిలదీసింది.
MINISTER AMBATI
Last Updated : Aug 5, 2022, 6:41 AM IST