MACHERLA INCHARGE BRAHMAREDDY FIRES ON YCP : ప్రభుత్వానికి రావలసిన జీఎస్టీని అక్రమ దారుల్లో వసూలు చేయడంలో మాచర్ల శాసనసభ్యుడి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మాచర్ల మండలం నాగార్జునసాగర్ వద్ద ఉన్న ఇంటర్ చెక్పోస్ట్ వద్ద మేనేజ్ చేసి సుమారు రోజుకి 200 గ్రానైట్ లారీలను పొరుగు రాష్ట్రాలకు తరలించి సంవత్సరానికి రూ.4వేల కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
మంగళవారం మాచర్ల సమీపంలో జీఎస్టీ విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి.. సరైన పత్రాలు లేవని ఏడు లారీలను నిలిపివేశారన్న బ్రహ్మారెడ్డి.. మరి మిగతా వాటి పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. గ్రానైట్ రవాణాకు వైసీపీ నాయకుల సహకారం ఉందని ఆరోపించారు. ఎన్ఎస్పీ కాలువ పనుల్లో కూడా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పనులు చేయకుండానే చేసినట్లుగా బిల్లులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని హైవే రోడ్ల వర్కుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.
మాచర్ల నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో కొంత మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తలుపులు తీయకపోవడంతో వారికి వచ్చిన ప్రభుత్వ పథకాలను కూడా రద్దు చేశారని ఆరోపించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి కట్టిన వాటిని కూల్చివేయడం, కాల్చివేయడం, బెదిరించడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని మండిపడ్డారు.