Argument Between Police And TDP Workers In Rayavaram : పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా.. ఆ పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రెంటచింతల నుంచి రాయవరం వరకు ఊరేగింపుగా బయలుదేరారు. కంభంపాడు వద్ద ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాచర్ల మండలం రాయవరంలో జరిగిన జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాయరపతినేని మాట్లాడుతూ.. తమ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపైన ఆయన ప్రస్తావించారు. జూలకంటి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
20వేల మెజార్టీతో గెలవడం ఖాయం :పల్నాడులో టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే వీళ్ల లెక్కలు అప్పజెబుతామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు అంతులేకుండా పోయిందని.. వీరిని ఎదుర్కొవడానికి టీడీపీ కార్యకర్తలు కొదమ సింహాల్లా దూకాలని పిలుపునిచ్చారు. తాను, బ్రహ్మారెడ్డి సొంత అన్నదమ్ముల వలే కలిసి పని చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి 20వేల మెజార్టీతో గెలవడం ఖాయమని యరపతినేని అన్నారు.
పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సిందే :మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటే ఇన్ని అడ్డంకులా అంటూ ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షలు దాటుకుని వేలాది మంది కార్యకర్తలు తన పుట్టిన రోజు వేడుకులకు హాజరయ్యారని అన్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధించిన వారందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూలకంటి హెచ్చరించారు.