Kotappakonda Prabhalu : రాష్ట్రంలో అనేక ప్రముఖ శైవ క్షేత్రాలున్నప్పటికీ.. మహాశివరాత్రి అనగానే భక్తుల మదిలో తప్పక మెదిలేది కోటప్పకొండే. ఈ పుణ్యక్షేత్రం శివరాత్రి పర్వదినాన అత్యంత ఎత్తైన ప్రభలతో శోభాయమానంగా వెలుగులీనుతుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు 80 నుంచి 90 అడుగుల ఎత్తైన విద్యుత్ ప్రభలు సాదరస్వాగతం పలుకుతాయి. వీటిని చిలకలూరిపేట మండలంలోని పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, యడవల్లి, కమ్మనేని వారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం గ్రామస్థులతో పాటు నరసరావుపేట మండలం ఉప్పలపాడు, యలమంద గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో రెండు, మూడు నెలలు కష్టపడి మరీ రూపొందిస్తారు.
"ప్రభలు అంటే మేము చాలా ఉల్లాసంగా ఉత్సహంగా చేసుకుంటాము. ఈ సమయంలో మా ఉద్యోగరిత్యా, గృహ సంబంధ, వ్యవసాయ పనులను పక్కకు పెట్టి మరి ప్రభలను ఏర్పాటు చేసుకుంటాము, ఇక్కడి ప్రభలనే చుట్టు పక్కల నియోజకవర్గాలలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు మహాశివరాత్రి ఉత్సవాలకు దేశంలో ఎక్కడున్న సరే వస్తారు"-కందుల వీరాంజనేయులు, కావూరు
"ప్రభల ఏర్పాటుకు ఒడిశా నుంచి కర్ర తీసుకువచ్చాము. రెండు నెలల ముందు నుంచే ఈ ప్రభల ఏర్పాటును ప్రారంభించాము. రాళ్లు తెప్పించి ప్రభలకు చక్రాలు తయారు చేయించాము."-మద్దుకూరి సాంబశివరావు, కావూరు
గతంలో నిర్మించిన చెక్క ప్రభల స్థానంలో ప్రస్తుతం విద్యుత్ ప్రభలను కడుతున్నారు. వీటి తయారీలో గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఇబ్బందులు ఎదురైనా, వ్యయ ప్రయాసలు పెరిగినా లెక్క చేయకుండా.. భక్తిభావంతో గ్రామస్థులు, యువకులు విద్యుత్ ప్రభలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తరతరాలుగా పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.