kotappa konda : మహాశివరాత్రిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కోటప్పకొండకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. భారీ ప్రభలతో సందడి వాతావరణం ఉంటుంది. వీవీఐపీలు, భక్తుల రాకపోకలతో కొండ ప్రాంతం కిటకిటలాడుతుంది. ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. కొండ కింద నుంచి అటు నరసరావుపేట.. ఇటు చిలకలూరిపేట వైపు వెళ్లాలంటే భక్తులు పడే పాట్లు వర్ణనాతీతం. కీలకమైన రహదారులు బాగు చేయాల్సిన యంత్రాంగం.. పండగ సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా వాటి పనులు మొదలెట్టింది. ఆయా మార్గాల్లో గోతులు పూడ్చి మమ అన్పిస్తున్నారు. రోడ్ల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన వంతెనన నిర్మాణాలు పూర్తికాక కొండకు ప్రభలు ఎలా తరలించాలని భక్తులు మథనపడుతున్నారు.
కొండ వరకు మూడు మార్గాలు : కోటప్పకొండకు చిలకలూరిపేట నుంచి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. చిలకలూరిపేట నుంచి పురుషోత్తమపట్నం, మద్దిరాల, బొప్పూడి, యడవల్లి ప్రభలు ఈ మార్గం గుండా కోటప్పకొండకు చేరుకుంటాయి. చిలకలూరిపేట నుంచి లింగంగుంట్ల, కావూరు, కోమటినేనివారిపాలెం, గోవిందపురం, కమ్మవారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, గోవిందపురం, కమ్మవారిపాలం ప్రభలు ఈ మార్గంలోనే వెళ్తాయి.
మూడు మార్గాలూ అధ్వానం :ఈ రెండు మార్గాలు అధ్వానంగా ఉన్నాయి. పురుషోత్తమపట్నం నుంచి మద్దిరాల వరకు ఇటీవల రోడ్డు వేశారు. అక్కడి నుంచి యూటీ వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యలో కల్వుర్టులు, రెండు లో లెవెల్ వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పండగనాటికి పూర్తిచేస్తామని చెబుతున్నా... ఇప్పటికీ శ్లాబులు వేయకపోవడంతో పూర్తవుతాయా, లేదా..?! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోమార్గం కోమటనేని వారిపాలెం నుంచి యూటీకి వెళ్లే రహదారి దారుణంగా ఉంది. చాలాచోట్ల రహదారి కుంగింది. దీనికి తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ మార్గాల్లో 90 అడుగులకు పైగా ఉన్న భారీ ప్రభలు వెళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే తరుణంలో ప్రభుత్వం పనుల వేగాన్ని పెంచాల్సిన అవసరముంది. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని భక్తులు కోరుతున్నారు.