ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివరాత్రికి ముస్తాబైన కోటప్పకొండ.. ఆ దేవాలయ చరిత్ర మీ కోసం.. - శివరాత్రి మహత్యం

maha shivratri: శివరాత్రి తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం అందంగా ముస్తాబైంది. ఎంతో చరిత్ర, ప్రాభవం గల కోటప్పకొండ.. పర్యావరణ, పర్యాటకప్రాంతంగానూ ప్రసిద్ది పొందింది. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. పర్యావరణ ప్రేమికులు పిల్లాపాపలతోనూ తరలివస్తారు. భక్తుల తాకిడి దృష్ట్యా దేవాదాయ శాఖ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

kotappakonda
కోటప్పకొండ తిరునాళ్లు

By

Published : Feb 17, 2023, 7:12 PM IST

కోటప్పకొండ త్రికోటేశ్వరాలయ వివరాలు

Kotappakonda getting ready for shivratri: శైవక్షేత్రాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేకస్థానం. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా, పర్యాటక, పర్యావరణ క్షేత్రంగా కోటప్పకొండ గుర్తింపు పొందింది. 1700 సంవత్సరాలుగా సిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటున్న కోటప్పకొండపై ఇక్కడ శివయ్య.. త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే మూడు కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపమాపరించుచుండగా.. బ్రహ్మ, విష్ణువులు, సకల దేవతలు స్వామివారిని శాంతింపజేయడానికి ఇక్కడకు వచ్చారనేది భక్తుల నమ్మకం.

త్రిమూర్తులు తపస్సు: మూడు పర్వత శ్రేణులపైనా త్రిమూర్తులు తపస్సు చేసినందున.. త్రికూటాలపై ముగ్గురు స్వాములను భారీ విగ్రహల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వరస్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వరస్వామి క్షేత్రం, విష్ణుశిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతియాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు.. అబ్బురపరిచే సహజ అందాలు మరో ఎత్తు. ఒకప్పుడు రాళ్లు, రప్పలు, చిట్టడవిగా ఉండే ఈ ప్రాంతం.. ఇప్పుడు కొత్తందాలతో కళకళలాడుతోంది.

రాష్ట్రప్రభుత్వం అధికారికంగా:కోటప్పకొండపై శివరాత్రి ఉత్సవాలు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇటీవల అన్నదాన శాలను ప్రారంభించారు. విగ్రహాలకు రంగులు వేయడంతో కోటప్పకొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. కేవలం శివరాత్రి, కార్తీకమాసం పర్వదినాల్లోనే కాకుండా.. కోటప్పకొండపై ఏడాదంతా భక్తులను రప్పించేందుకు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువభాగంలో పిల్లలపార్కు, కాళింది మడుగు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు, పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శన శాల మహిళలు, పిల్లలను ఆకట్టుకుంటోంది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. శివరాత్రికి ముందుగానే త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుడిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మొక్కులు తీర్చడానికి పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలను కూడా శివయ్య వద్దకు తీసుకువస్తున్నారు.

ఏర్పాట్లపై అధికారులు: శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు అధికారులు. ట్రాఫిక్ కారణాలరీత్యా కొండపైకి మినీ బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. తిరుగుమార్గంలో గతంలో మాదిరిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదార్లను విస్తరించారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు శాంతిభద్రతలపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల అరిసెలు, 2 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు.

స్వామి కటాక్షం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున విద్యుత్ ప్రభలతో తరలిరావడం ఇక్కడ ప్రత్యేకత. 70, 80 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు... వెలుగులు విరజిమ్ముతూ శివరాత్రి పర్వదినాన కోటప్పకొండంపై కొత్తందాలు తీసుకువస్తాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details