TDP Minority Leader Kidnap in Palnadu: రాష్ట్రంలో కిడ్నాప్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. 15రోజుల వ్యవధిలోనే మూడు కిడ్నాప్‌లు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జూన్13న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల అపహరణ మరువకముందే.. ఈ ఒక్కరోజే మరో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దంపతులను విశాఖలో ఏడుగురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేయగా.. పోలీసులు గంటల సమయంలోనే ఛేదించి.. నిందితులను పట్టుకున్నారు.
TDP Minority Leader arrest: మాచర్లలో టీడీపీ మైనారిటీ నాయకుడు అరెస్ట్.. రిమాండ్
13:39 June 29
కారంపూడి కేసులో అరెస్ట్
పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నియోజకవర్గ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచురుడు అన్వర్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. కారంపూడిలో వైసీపీ, టీడీపీ నేతల గొడవలో అన్వర్ 13వ ముద్దాయిగా ఉన్నాడు. అన్వర్‌ను బుధవారం అర్ధరాత్రి కొంతమంది వచ్చి పోలీసులమని చెప్పి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. అన్వర్‌ను కిడ్నాప్ చేశారని బయటకు పొక్కడంతో కలకలం నెలకొంది. అయితే సాయంత్రానికి పోలీసులు అన్వర్‌ను కోర్టులో హాజరుపరచగా... 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇదిలావుండగా అన్వర్‌ను పండగ రోజు అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్వర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులు జైలు వద్దకు వచ్చారు. తండ్రిని చూసి అన్వర్ రెండేళ్ల కుమార్తె గుక్కపెట్టి ఏడ్చింది.
విశాఖలో దంపతుల కిడ్నాప్..: విజయవాడకు చెందిన లక్ష్మి, శ్రీనివాసరావు వారం రోజుల కిందట విశాఖపట్నంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్లుగా చేరారు. ఈ క్రమంలో ఏడుగురు వ్యక్తులు దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని బయల్దేరారు. పాయకరావుపేట సమీపంలోలక్ష్మి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని కారు నుంచి దిగి కేకలు వేసింది. ఏం జరుగుతోందో తెలియని స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో కిడ్నాపర్లు వారిని వదిలేసి పరారయ్యారు. ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న విశాఖ నాలుగో పట్టణ పోలీసులు... పరారైన మరో నలుగురు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
కిడ్నాప్ ఘటనపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ: విశాఖలో స్థిరాస్తి వ్యాపారి దంపతుల కిడ్నాప్ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ స్పందించారు. స్థిరాస్తి వ్యాపారం ఆర్థిక లావాదేవీల్లో వివాదాల వల్లే దంపతులను కిడ్నాప్ చేసినట్లు సీపీ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పట్నాల శ్రీనివాస్, లోవ లక్ష్మి దంపతులు నాలుగు నెలల క్రితం విశాఖకు వచ్చి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. బుధవారం పట్నాల శ్రీనివాస్ దంపతులను బ్రహ్మయ్య, సాయినిఖిల్, మణికంఠ, ప్రదీప్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు శ్రీనివాస్ దంపతులను కారులో అపహరించారు. గతంలో శ్రీనివాస్ వీరితో కలిసి ఎంకే కన్‌స్ట్రక్షన్స్ పేరుతో వ్యాపారం చేశాడని సీపీ తెలిపారు. దంపతులను కిడ్నాప్ చేసిన అనంతంర ఎలమంచిలి దగ్గర శ్రీనివాస్ భార్య లక్ష్మిని విడిచిపెట్టడంతో.. ఆమె కత్తిపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నామని తెలిపారు. గతంలో శ్రీనివాస్‌పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలో మోసం కేసులు నమోదయ్యాయని సీపీ వెల్లడించారు.