Godavari-Penna River Linking Project : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, జనసేన నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. నకరికల్లులో గత టీడీపీ గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన నిర్వహించారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు.
పేరు పెట్టారు.. అభివృద్ధి మరిచారు : గోదావరి-పెన్నా అనుసంధానం కోసం గత టీడీపీ హయాంలో 2018 లో నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ రోజుతోనే ఈ ప్రాజెక్టును మరచిపోయారని, ప్రభుత్వం మారిన తర్వాత పనులు జరగటం లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ మోహాన్ రెడ్డి అధికాంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోని, వాటికి వారి తండ్రి గారి పేరు పెట్టారు గానీ వాటిని అభివృద్ధిని మరిచారని అన్నారు.
ప్రాజెక్టు ఉందని గుర్తు చేయడానికి వచ్చాం : నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గంలో ప్రాజెక్టుకు టీడీపీ శంకుస్థాపన చేసిన సంగతి ఆయనకు తెలియదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఉందనే విషయం అంబటి కి తెలియజేయడం కోసం జనసేన నాయకులు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలోని నీటి పారుదల ప్రాజెక్టు వైపు ఓసారి చూడండని కోరారు. తక్షణమే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరగా రైతులకు వ్యవసాయ నీటిని అందించాలని గాదె వెంకటేశ్వర రావు సూచించారు.