CM Jagan Meeting: ‘మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయాలి. చేయలేమనో, కష్టమనో మీకు అనిపిస్తే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తా’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ‘ఈ పని మీకేమైనా భారమని అనుకుంటుంటే చెప్పండి’ అని సీఎం ప్రశ్నించారు.
ఎవరూ స్పందించకపోవడంతో.. ‘ఏం ఎవరూ పలకడం లేదు’ అంటూ ముందు వరుసలో కూర్చున్న మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రాంతీయ సమన్వయకర్త) మేకతోటి సుచరిత (గుంటూరు జిల్లా అధ్యక్షురాలు) పేర్లను ప్రస్తావిస్తూ మళ్లీ అందరినీ అడిగినట్లు తెలిసింది. ‘ప్రాంతీయ సమన్వయకర్తలు వారికి కేటాయించిన రీజియన్‌లో 10 రోజులు తిరగాల్సిందే’ అని ఆదేశించారు. ‘జిల్లా మంత్రి, ప్రజా ప్రతినిధులు, పార్టీ కేడర్‌ను జిల్లా పార్టీ అధ్యక్షులు సమన్వయం చేయాలి’ అని స్పష్టం చేశారు.
నియోజకవర్గానికి రూ. 1.20 కోట్లు
నెలకు ప్రతి నియోజకవర్గంలో 6 గ్రామ/వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ‘ఒక్కో సచివాలయానికీ రూ. 20 లక్షల చొప్పున ఆరింటికీ రూ. 1.20 కోట్లు కేటాయిస్తున్నాం, వీటితో పనులు చేపట్టాలంటే ఎమ్మెల్యేలు కచ్చితంగా తిరిగి సమస్యలను గుర్తించాలి కదా? అందువల్లే అది జరుగుతోందా లేదా అనేది కూడా మీరే (జిల్లా అధ్యక్షుడు, ప్రాంతీయ సమన్వయకర్తలు) పర్యవేక్షించాలి, సమన్వయం చేయాలి’ అని స్పష్టం చేశారు. ఆగస్టు 4 నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి కీలకమైన 50 మంది కార్యకర్తలతో భేటీ కానున్నట్లు సీఎం వెల్లడించారు.
అక్టోబరు 2లోగా కమిటీలు
‘జిల్లాల్లో పార్టీ జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గ, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలను అక్టోబరు 2లోగా నియమించాలి’ అని జగన్ వారికి సూచించారు. ఈ అన్ని కమిటీల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కమిటీల్లో మొత్తంమీద 50 శాతం మహిళలు ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు జిల్లా అధ్యక్షులు, ఐ ప్యాక్ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు: డాక్టర్ నాగరత్న