High Court Status Quo Orders On Granite Mining : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులిస్తూ.. మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాప్‌రెడ్డి, శ్వేతారెడ్డి, G.V. దినేష్‌రెడ్డి, శివపార్వతికి నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు N.O.C. ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డి.కె. పట్టాలు రద్దు చేయకుండా తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మొత్తం 21 ఎకరాల 50 సెంట్ల భూమిలో గ్రానైట్ తవ్వకాలు చేపట్టారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. గ్రానైట్ తవ్వకాలను NOC ఇచ్చిన తహశీల్దారుకు.., అలాగే రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు జారీ చేసింది. ఒక్కో ఎకరాలో.. 200 కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ కేసు విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని.. మంత్రి విడదల రజిని, ఇతరులను ఆదేశించింది.
అసలేం జరిగింది: పల్నాడు జిల్లా మురికిపూడి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో గతంలో తమకిచ్చిన భూముల్లో గ్రానైట్ తవ్వకాలకు లీజులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని 65 మంది హైకోర్టును ఆశ్రయించారు. 2007 - 2008 సంవత్సరాల్లో 90 ఎకరాల్లో తమకు అసైన్డ్ భూముల పట్టాలు ఇచ్చారని.. పిటిషన్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు హైకోర్టుకు నివేదించారు. ‘బీ-ఫాం పట్టా పొందాక పిటిషనర్లు అందరు ఆ భూములను సాగు చేసుకుంటున్నారని పిటిషనర్ల న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ 2022 డిసెంబర్27న వాదనలు వినిపించారు.
ముఖ్యమంత్రి జగన్‌కి సమీప బంధువు, ఎంపీ అవినాష్‌రెడ్డి మామ కావడంతో జి.వీరప్రతాప్‌రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సతీమణికి చెందిన సంస్థలకు గ్రానైట్ క్వారీ లీజుకు ఇవ్వబోతున్నారని కోర్టుకు తెలిపారు. తహశీల్దార్, స్థానిక వీఆర్‌వో పిటిషనర్లను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. ఎస్సై సైతం పిటిషనర్లను ఠాణాకు పిలిపించి క్వారీ లీజును అడ్డుకోవద్దని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని బెదిరించారన్నారు. బీ-ఫాం పట్టాలను సరెండర్ చేయాలంటున్నారని వాదించారు. మంత్రి రజని వద్దకు వెళ్లాలని ఎస్సై సూచించారని... ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మంత్రి రజినిని కొంతమంది పిటిషనర్లు కలిశారని న్యాయవాది వాదనలు వినిపించారు.
అభ్యంతరం చెప్పడం ఆపకపోతే మీ పట్టాలను రద్దు చేయిస్తానని మంత్రి రజని హెచ్చరించారన్నారు. మంత్రి అనుచరులు బెదిరించారని.. పలుకుబడి ఉన్న వ్యక్తులు మైనింగ్ లీజుకోసం దరఖాస్తు చేయడంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్వోసీలు ఇచ్చారని వాదనలు వినిపించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని గ్రానైట్ మైనింగ్ లీజు మంజూరు చేయకుండా అడ్డుకోవాలని... వాటిని రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఆ భూముల నుంచి పిటిషనర్లలను ఖాళీ చేయించకుండా అధికారులను అడ్డుకోవాలని అభ్యర్థించారు.
పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మామ జి.వీరప్రతాప్‌రెడ్డి వ్యాపార భాగస్వామి, ఎండీగా ఉన్న వీరశివ గ్రానైట్స్, వీరభద్ర మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దినేష్‌గ్రానైట్స్, జీవీ దినేష్‌రెడ్డి గ్రానైట్స్, మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సతీమణి అరుణ వ్యాపార భాగస్వామిగా ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర మైన్స్, మినరల్స్‌కు 2022 డిసెంబర్ 27న నోటీసులు జారీచేసింది. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, ఇతరులకి నోటీసులు ఇచ్చింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మరోసారి మంత్రికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదికీ వాయిదా వేసింది.
ఇవీ చదవండి: