Eruvaka Guru Poornami celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం పెదగాదెలవర్రులో నిర్వహించిన ఏరువాక ఉత్సవాల్లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. స్థానిక రైతులతో కలిసి గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించి పూజలు చేశారు. దుక్కులు దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు భరోసా కల్పించేందుకే ఏరువాక చేపట్టామని ఆనందబాబు చెప్పారు. వైసీపీ పాలనలో రైతులు అన్ని రకాలుగా దగా పడ్డారని విమర్శించారు. అద్దంకిలోని గోశాలలో.. బసవన్నలను అలంకరించి, అరకలకు పూజలు చేసి.. పొలాల్లో ఏరువాక నిర్వహించారు. కాకానిపాలెం, దామవారిపాలెం రైతులు.. ఆరు జతల ఎద్దులతో ఏరువాక చేపట్టారు.
పల్నాడు జిల్లా..తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు.. రైతులతో కలిసి పల్నాడు జిల్లా ఈపూరు గ్రామ పొలాల్లో ఏరువాకను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో 20 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినందుకు.. పార్టీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
- ALSO READ:కరెంట్ షాక్కు విలవిలాడుతున్న రొయ్య.. అక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యుత్ బిల్లులు
గుంటూరు.. తెలుగుదేశం రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులతో కలిసి భూమాత, గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం అరక దున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించారు. పొలాల్లో ఎద్దులతో దుక్కులు దున్ని సాగు పనుల్ని ప్రారంభించారు.