GUN FIRING INCIDENTS : పోరుగడ్డ పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ మళ్లీ పడగవిప్పుతోంది. వరుస ఘటనలతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. హత్యలు, దాడులు సామాన్య ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా రొంపిచర్ల మండలం అలవాలలో తుపాకీతో కాల్పులు ఆందోళన కల్గిస్తున్నాయి. రొంపిచర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలికోటిరెడ్డిపై ప్రత్యర్థులు..తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్చగా...బాలకోటిరెడ్డి శరీరం రక్తంతో తడిసిపోయింది.
పక్కా ప్లాన్‌తో ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులు పమ్మి వెంకటేశ్వర రెడ్డి, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లు, పూజల రాముల్ని పోలీసులు పట్టుకున్నారు. రాజకీయ కోణంలో జరిగిన దాడి కాదని.. ఆధిపత్య పోరు, పాతగొడవలే కారణమని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.
కొంతకాలంగా పల్నాడులో హత్యలు, హత్యాయత్నాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రధానంగా గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిరోజుల క్రితమే బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగినా.. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ దాడి చేశారని వారు ఆరోపించారు. పల్నాడులో పరిస్థితులు ఆందోళన కలిగిస్తుండటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ ఎంపీపీ శివరామయ్య, తనయుడు ఆదినారాయణతోపాటు మరికొందరు పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామ నడిబొడ్డున గొంతుకోసి హత్యచేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.
పల్నాడులో జరిగిన కొన్ని ఘటనలు ఇలా..
* దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు పట్టపగలు గ్రామం ప్రధాన రహదారిపై దాడిచేసి హత్యచేశారు. ఈ గ్రామంలో టీడీపీ సానుభూతిపరులైన 50 కుటుంబాలు ఇప్పటికీ గ్రామం విడిచిపెట్టి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. వీరి పొలాలు బీడుగా మారాయి.