Farmers Angry On False Propaganda In Challagundla Village : పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలో ధాన్యం రైతుల ఇక్కట్లను ప్రతిబింబించేలా 'ఈనాడు' పత్రికలో వచ్చిన 'రైతు మునుగుతున్నా మొద్దు నిద్రేనా?' శీర్షికన వచ్చిన కథనం ప్రచురితమయింది. అందులోని వారు వ్యాపారులని, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వ అధికారులే నమ్మించే ప్రయత్నం చేశారు. సచివాలయ సిబ్బందితో ఫొటోలు తీయించి అధికారపార్టీ పత్రికకు ఇచ్చారు. దీనిపై ఆ పత్రికలో రైతులెవరో తెలియదా అంటూ కథనాన్ని వండివార్చారు. కనీసం బాధిత రైతుల్ని పలకరించలేదు. వారు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? పంటనష్టం ఏంటనే వివరాలూ తీసుకోలేదు.
ప్రశ్నిస్తున్న రైతులు : కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసి కూడా నష్టం లేదనడం ఏమిటనే ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎవరో సచివాలయ సిబ్బంది వచ్చి వెళ్లారని చెప్పారు తప్పితే, పంటనష్టంపై నేరుగా ఎవరూ తమతో మాట్లాడలేదని బాధిత రైతులు వివరించారు. చల్లగుండ్లలో ధాన్యం మిల్లుల పక్కనున్న బొంతు శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందిన ప్లాట్‌ఫాంపై ఆరబోసుకున్నామని, ఆ మాత్రానికి వ్యాపారులనే ముద్ర వేస్తారా? అని ప్రశ్నించారు. ధాన్యం మిల్లుల పక్కనుంటే వ్యాపారుల ధాన్యమై పోతుందా? అని మండిపడ్డారు.
ధాన్యాన్ని డ్రైయర్‌లో ఆరబెట్టుకుంటున్న రైతులు :ప్లాట్‌ఫాంపై ఆరబెట్టిన ధాన్యం తమదేనని నకరికల్లు మండలం చల్లగుండ్ల, త్రిపురాపురం గ్రామాలకు చెందిన బాధిత రైతులు శంకర్, మేకల నాగేశ్వరరావు వివరించారు. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో తడిసిన ధాన్యాన్ని డ్రైయర్‌లో వేసి ఆరబెట్టుకుంటున్నామని వారు చెప్పారు. ఇందుకు ఒక్కో బస్తాకు 100 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. కౌలుకు తీసుకుని నాలుగెకరాలు సాగు చేశామని, 120 బస్తాల ధాన్యం వర్షాలకు తడిసిపోయిందని వాపోయారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరారు.