Water Crisis in Piduguralla: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. జనాభాకు తగ్గట్లు నీటి సరఫరా జరగడం లేదు. ఒక్కో వ్యక్తికి సగటున 135 లీటర్ల నీరు అందించాల్సి ఉండగా.. కేవలం 90 లీటర్ల వరకే సరఫరా జరుగుతోంది. పట్టణంలోని 6, 7, 11, 12, 13, 14, 23 వార్డులకు పూర్తిస్థాయిలో నీరు అందుతుండగా.. మిగతా వార్డుల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న తాగునీటి పథకం పూర్తిస్థాయి సామర్థ్యం 12.20 ఎంఎల్డీ కాగా.. 10 పవర్ బోర్ల ద్వారా ప్రస్తుతం 6.32 ఎంఎల్డీ నీరు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం 3 వేల 500 కుళాయి కనెక్షన్లు ఉండగా.. మరో 11 వేల 500 కుళాయిలు వచ్చే మార్చి నాటికి అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అప్పటిదాకా పిడుగురాళ్ల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
సుందరయ్య కాలనీ, ఇందిరమ్మ నగర్, సంజీవరెడ్డి నగర్, శ్రీనివాస కాలనీ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా ఇంటి ముందు డబ్బాలు పెట్టి తాగునీటిని దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా వేసవిలో సమస్య తప్పడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.