Double Votes for YCP Sympathizers: మితిమీరుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - వైసీపీ సానుభూతిపరులకు రెండేసి ఓట్లు Double Votes for YCP Sympathizers: ఓటర్ల జాబితాలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో.. భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చుతున్నారు. గ్రామాల్లో నివసించే వైసీపీ సానుభూతిపరులకు.. స్థానికంగా ఓటు హక్కు కొనసాగించడంతో పాటు సమీప పట్టణాల్లోనూ వారికి మరో ఓటు కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండేసి ఓట్లు కలిగినవారు సుమారు 200 మంది ఉన్నారు.
ఇదే తరహాలో మరో 300 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. ప్రధానంగా యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన పల్లెల్లోని వైసీపీ సానుభూతిపరులకు.. చిలకలూరిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో అనుకూలమైన ఇంటి నంబర్లు వేసి ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేయిస్తున్నారు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు - మౌనం వహించిన ఎన్నికల సంఘం!
బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లకు చెందిన అగస్టీన్‌పాల్.. అదే గ్రామంలో పోలింగ్ కేంద్రం 59లో.. 399 లో ఓటరుగా నమోదయ్యారు. ఇదే వ్యక్తి చిలకలూరిపేట పట్టణం సుగాలీకాలనీ 34వ వార్డు 146వ పోలింగ్ బూత్‌లో ఓటు కోసం ఈనెల 3న ఫారం-6 దాఖలు చేశారు. వలపర్లకు చెందిన పులిపాటి రాజశేఖర్, నల్లమిద్ది సంగీతరావు, కోపూరి నాగేశ్వరరావు, కొప్పుల మాణిక్యరావు, జండ్రాజుపల్లి ఏసయ్యలకు.. 59వ పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉన్నాయి.
వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఆధార్ కార్డులిచ్చి చిలకలూరిపేటలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. అదేవిధంగా నాదెండ్ల మండలం సంకురాత్రిపాడుకు చెందిన సుమారు 72 మందికి గ్రామంలో ఓటు హక్కు ఉంది. వీరంతా చిలకలూరిపేట భావనారుషినగర్‌లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల కోసం దరఖాస్తులు పెట్టారు.
అధికార పార్టీ అయితే ఓటు హక్కు ఓకే - టీడీపీపై సానుభూతి ఉంటే ఇక అంతే!
2022లో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ తరువాత.. చిలకలూరిపేటలోని 159వ పోలింగ్ కేంద్రంలో ఇతర ప్రాంతాల వారివి 51 దొంగ ఓట్లు ఉన్నట్లు తెలుగుదేశం నేతలు గుర్తించారు. ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇటీవల అక్టోబరు 27న ప్రకటించిన ముసాయిదా జాబితాలోనూ అవి యథాతథంగా ప్రచురితమవ్వడం అనుమానాలకు తావిస్తోంది.
"రెండు చోట్ల ఒక ఓటు ఉండటానికి వీలులేదు కదా. మేము ఏ రోజుకు ఆ రోజు లిస్టును చెక్ చేస్తున్నాము. గత ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారు. మరోసారి ఇప్పుడు అదే విధంగా గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏ ఊరు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ రెండో ఓటు ఇచ్చారో వారిపై కేసు పెట్టాలి. రిటర్నింగ్ ఆఫీసర్ కరెక్టుగా వెరిఫై చేస్తే.. నియోజకవర్గంలో 12 వేలకు పైగా ఓట్లు బయటపడతాయి. రండి ఇంటింటికీ తిరుగుదాము. నేను చెప్పిన దాని కంటే తక్కువ ఓట్లు వస్తే.. దేనికైనా కట్టుబడతాను". - ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి
'వైసీపీతో పెట్టుకుంటే ఓట్లు గల్లంతే' ఒకరి ఓటు తొలగించాలని మరొకరు దరఖాస్తు - ఉద్యోగులు, సామాన్య ఓటర్లు షాక్