Walther Veeraya Director Bobby: మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. సంక్రాంతి బరిలో బాలకృష్ణ చిరు ఇద్దరి సినిమాలు పోటా పోటీగా రావడంతో.. మరే ఇతర సినిమా పోటీలో నిలవడానికి సాహసించలేదు. అలాటిది సంక్రాంతి బరిలో ఉన్న చిరు చిత్రం వాల్తేరు వీరయ్య ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర బృందం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య చిత్రానికి చెందిన నటులు, వివిధ ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబి పల్నాడు జిల్లా, నరసరావుపేటలో చిరు అభిమానులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్ర విజయోత్సవ వేడుకలు: పల్నాడుజిల్లా నరసరావుపేటలో వాల్తేరు వీరయ్య చిత్ర దర్శకుడు బాబి ఆదివారం సందడి చేశారు. కార్యక్రమంలో మొదటగా అభిమానులు నకరికల్లుకు చేరుకుని దర్శకుడు బాబికి ఘనస్వాగతం పలికారు. అనంతరం నకరికల్లు క్రాస్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో దర్శకుడు బాబి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నరసరావుపేటలో అభిమానులతో ర్యాలీగా వెళ్లి రవికళామందిర్ థియేటర్‌లో చిత్ర విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డ ప్రేక్షకులకు దర్శకుడు బాబి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా థియేటర్‌లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను దర్శకుడు బాబి కట్ చేశారు. దర్శకుడు బాబి విజయోత్స వేడుకలకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీగా చేరుకుని ఆయనకు స్వాగతం పలికి సెల్ఫీలు దిగారు.