ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండగుట్టల్లో దాగిన అదృష్టం! - జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలంట - ఆంధ్రప్రదేశ్​లో వజ్రాల వేట

Diamonds in Palnadu District: వజ్రం.. ఎంతో విలువైనది. ఒక్క వజ్రం దొరికినా జీవితం మారుతుంది. ఆ ఆశతోనే పల్నాడు జిల్లాలోని ఆ కొండ చుట్టూ నిత్యం వజ్రాల వేట సాగుతోంది. ఖరీదైన వజ్రం కాకపోయినా.. రంగురాళ్లు దొరికినా.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతో మరికొందరు అదృష్టం వెతుక్కుంటున్నారు.

Diamonds_in_Palnadu_District
Diamonds_in_Palnadu_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 1:11 PM IST

కొండగుట్టల్లో దాగిన అదృష్టం! - జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలంట

Diamonds in Palnadu District: కొండ చుట్టూ కనిపిస్తున్న జనం.. ఆ జనాన్ని చూస్తే ఎవరైనా సరే.. అక్కడేదో పని చేస్తున్నారనో.. రాళ్లు కొడుతున్నారనో అనుకుంటారు. కానీ వారంతా తమ అదృష్టాన్ని ఆ కొండగుట్టల్లో వెతుక్కుంటున్నారు. పలుగు, పార, కొడవలి, ఇనుపచువ్వ.. ఇలా ఏది ఉంటే దాంతో తవ్వకాలు చేస్తూ రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు.

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం త్రిపురాపురం కొండల్లో నిత్యం ఈ వజ్రాల వేట సాగుతోంది. కొండల వద్ద గ్రావెల్ కోసం తవ్వకాలు జరగటం మామూలే అయినా.. ఇలా వజ్రాలు దొరుకుతాయనే ఆశతో ఇక్కడ జనం వెతుకుతున్నారు. వజ్రాల వేటకు చుట్టు పక్క ప్రాంతాల వారే కాదు.. ఇతర మండలాలు, పొరుగు జిల్లాల నుంచి కూడా జనం తరలివస్తుండటం ప్రత్యేకత.

Search for diamonds in Nallamala Forest : వక్కిలేరు వాగులో...వజ్రాలకోసం వెతుకులాట...

ఒక్క వజ్రం దొరికినా చాలు.. తమ జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశతో తవ్వకాలు చేస్తున్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్లు దాటిన వృద్ధులు కూడా ఈ వెతుకులాటలో కనిపిస్తారు. మరికొందరు ఇంటిల్లిపాది విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి.. రంగురాళ్లు అన్వేషిస్తుంటారు. చంటిపిల్లల్ని వెంటేసుకుని వచ్చి వారికి ఊయల కట్టి జోలపాడి నిద్రపుచ్చి.. ఆ తర్వాత వజ్రాల కోసం వెతికేవారు కూడా ఉన్నారు.

గతంలో బెల్లంకొండ ప్రాంతంలోని కొల్లూరులో వజ్రాలు దొరికిన ఘటనలు ఉన్నాయి. అదే కోవలో ఇక్కడా వజ్రాలు ఉంటాయనే నమ్మకంతో వీరు తవ్వకాలు చేస్తుంటారు. పారదర్శకత, మెరుపుని బట్టి వజ్రాలను గుర్తించి సేకరిస్తుంటామని అన్వేషకులు చెబుతున్నారు. వజ్రాలు దొరికితే వాటిని వ్యాపారులకు విక్రయిస్తారు. బరువు, రంగుతో పాటు అది ఏ రకం, ఎన్ని క్యారెట్లు అనేదాన్ని బట్టి వజ్రం విలువను లెక్కిస్తారు. 'క్యారెట్లు' పెరిగేకొద్దీ వజ్రం విలువ మరింత పెరుగుతుంది.

కూలీ​కి దొరికిన భారీ డైమండ్​.. రాత్రికి రాత్రే లక్షాధికారిగా!

ఒక్క వజ్రం దొరికినా.. క్షణాల్లోనే తాము లక్షాధికారులుగా మారిపోతామనే ఆశ వీరిని కొండ వెంట తిరిగేలా చేస్తోంది. తెల్లవారుజాము నుంచే వజ్రాల వేట ప్రారంభమై మసక చీకటి పడే వరకు ఈ అన్వేషణ సాగుతోంది. వర్షాలు కురిసే సమయంలో అయితే వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయని నమ్మకం. ఆ సమయంలో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. అయితే వజ్రం దొరికిన వారెవ్వరూ బయటకు చెప్పరు. వీరు సేకరించిన రాళ్లను అక్కడే తనిఖీ చేసే ముఠా ఉంటుంది. అక్కడ ఉన్న వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తారు.

ఇక్కడకు వచ్చేవారికి వజ్రాలు దొరుకుతాయని చెప్పలేం కానీ.. తినుబండరాలు, ఐస్ క్రీంలు అమ్మేవారికి మాత్రం ఉపాధి దొరుకుతోంది. కొండల వద్ద తవ్వకాల విషయం తెలిసినా అధికారులు, పోలీసులు పెద్దగా పట్టించుకోరు. అడపాదడపా తనిఖీలు చేస్తారు. అక్కడ ఉన్నవారిని పంపించి వేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ వెతుకులాట మామూలే.

వర్షం వచ్చింది... వజ్రాల వేట మొదలైంది!

ABOUT THE AUTHOR

...view details