Crops Damaged Due to Heavy Rains: అతివృష్టి.. అనావృష్టి ఏదైనా సరే అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చేదే. పంట చేతికొచ్చే వరకు రైతన్నలకు కునుకుండదు. చినుకు కోసం ఆకాశం వైపు.., మెులకెత్తే విత్తనం కోసం భూమి వైపు ఆశగా చూస్తారు. నెల కిందటి వరకు తీవ్ర వర్షాభావంతో ఎండిన పంటలు.. ఇటీవల కురిసిన భారీ వానలతో నీటిపాలయ్యాయి. పల్నాడు జిల్లాలో వందల ఎకరాల్లో ప్రత్తి, మిరప, మినుము, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు.
Farmers Worried About Crop Loss: ఇటీవల కురిసిన వానలు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం రైతులకు నష్టాన్నికలిగించాయి. నరుకుళ్లపాడు, యండ్రాయి, పెదమద్దూరు వాగుల ఉద్ధృతికి.. నీరంతా పొలాల మీద పడ్డాయి. ప్రత్తి, మిరప, మినుము, బెండ సహా అనేక పంటలు నీట మునిగాయి. నీరు నిలబడిపోవడంతో మొక్కలన్నీ కుళ్లిపోయాయి. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి.. రెక్కలు ముక్కలు చేసి పండించిన పంట వర్షార్పణమైందని రైతులు లబోదిబోమంటున్నారు.
Crops Submerged in Flood కాల్వలను గాలికి వదిలేశారు.. పంటను వర్షాలకు వదిలేయాల్సి వచ్చింది!
Crop Damage Due to Rains: ఆ మధ్యకాలంలో వానలు పడకపోవడంతో.. ట్యాంకులతో నీరు తెచ్చి మరీ మిరప పంట వేశారు. నారు నాటిన రెండు వారాలకే.. భారీ వర్షం పడింది. దీంతో వాగులు ఉప్పొంగి పంటలను ముంచేశాయి. వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటే.. కనీసం చూసేందుకు వ్యవసాయాధికారులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.