CM Jagan Vinukonda paryatana updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న చేదోడు' పథకానికి సంబంధించిన నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. షాపులున్న రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఈ పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
సీఎం జగన్ వినుకొండలో ఈరోజు విడుదల చేయనున్న 330.15 కోట్ల ఆర్ధిక సాయంలో.. 1,67,951 షాపులున్న టైలర్లకు రూ.167.95 కోట్లు, 1,14,661 షాపులున్న రజకులకు రూ.114.67 కోట్ల లబ్ధి, 47,533 షాపులున్న నాయీబ్రాహ్మణులకు రూ.47.53 కోట్ల లబ్ధి చేకూరనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
అనంతరం సీఎం జగన్ నేటి వినుకొండ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ''ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.'' అని షెడ్యూల్లో వెల్లడించారు.