CM JAGAN ON FAMILY DOCTOR CONCEPT: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో పర్యటించిన జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం అమలులోకి వస్తుందని జగన్ తెలిపారు. గ్రామాల్లోకి వైద్యులే వచ్చి సేవలందిస్తారని పేర్కొన్నారు. ఆధునిక వైద్యం అందించడమే ఫ్యామిలీ డాక్టర్ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంపై దేశవ్యాప్తంగా వచ్చి పరిశీలిస్తారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దేశం మొత్తం ఈ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు.
ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో వైద్యుడు: ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. మందులు కూడా ఉచితంగా అందిస్తారని.. మంచానికి పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తారని చెప్పారు. వైద్యసేవల్లో నూతన విధానానికి శ్రీకారం చుట్టామన్న సీఎం.. మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేశామన్నారు. ప్రతి పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటారని.. ఎప్పుడు, ఏ సమయంలో ఫోన్ చేసినా వైద్యుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగాం: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మంచి ఆశయాలతో ఏర్పాటు చేశామన్న జగన్.. ప్రజలు ఆస్పత్రి వద్దకు వెళ్లనవసరం లేదని.. వైద్యులే ఇంటికి వచ్చి సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. వైద్య చికిత్సల కంటే నివారణ ముఖ్యమని.. దేశానికే ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలవనుందని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కేవలం సాధారణ వైద్యసేవలు మాత్రమే కాదని.. ఎన్నో రకాల సేవలు అందుతాయని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎమ్లు, నర్సులు, ఆశా వర్కర్లు.. ఈ కార్యక్రమానికి అనుసంధానం అవుతారని.. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం గొప్ప మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.