ARREST: పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు గార్లపాటి వెంకటేష్‌ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైకాపా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో అర్ధరాత్రి వెంకటేష్ నివాసానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో గడ్డపారతో తలుపులు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులను వెంకటేష్ అడ్డుకున్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆధారాలూ లేకుండా అరెస్ట్ చేయడానికి రావడం ఏంటని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటేష్ న్యూస్ 25 అనే యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని.. అందుకే తీసుకెళ్తున్నట్లు చెప్పారని వెంకటేష్ తల్లిదండ్రులు వివరించారు. తమ కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండని ఎంత ప్రాధేయపడినా.. చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఇంట్లో వాళ్ల సెల్ ఫోన్లు అన్ని తీసుకెళ్లారని తల్లిదండ్రులు తెలిపారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు గుంటూరు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.