TDP Idemi Karma Rastraniki Programme: తెలివిలేనివాళ్లు అధికారంలోకి వస్తే దోపిడీ తప్ప మరేమీ ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా మేడికొండూరులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని నిర్మించాలని అనుకున్నానని అన్నారు. కానీ ప్రజలు జగన్ మాటలు విని మోసపోయారని పేర్కొన్నారు. చివరికి రాజధాని ఉన్న తాడికొండలోనూ వైకాపాను గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్ని చేసినా అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని రైతులు చేస్తోంది ధర్మపోరాటమన్న చంద్రబాబు.. జగన్ ఆడుతున్న మూడుముక్కలాట సాగదని హెచ్చరించారు.
ఇప్పుడు ఉపాధి లేక వలసలు పెరిగిపోయన్న చంద్రబాబు.. కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు కూలి పనుల కోసం వచ్చిన వారిని కలిశాననీ.. వారి బాధలు నన్ను కలచివేసాయని చంద్రబాబు వెల్లడించారు. సమాజంలో పైకి వచ్చిన వారి మరికొందరికి ఊతమివ్వటమే పీ4 ఫార్ములా ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 ఫార్ములా అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ ఫార్ములా ప్రకారం పేదలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అమరావతి పీ 4 ఫార్ములాకు ప్రత్యక్ష ఉదాహరణ అని వెల్లడించారు. సింగపూర్, దుబాయ్‌ని అక్కడి పాలకులు స్వర్గంలా మార్చారన్న చంద్రబాబు..ఇక్కడి పాలకులు అమరావతిని శ్మశానంలా మార్చారని మండిపడ్డారు. జగన్ వద్ద ఉంటే డబ్బు తీసుకుంటే ఒక్కో బూత్‌లో ఒకరిని కోటీశ్వరులను చేయొచ్చని ఎద్దేవా చేశారు. పేదలను ధనిక కుటుంబాలుగా చేసే బాధ్యత తనదని చంద్రబాబు పేర్కొన్నారు.
సైకో పాలనలో పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న చంద్రబాబు.. ఇదే పోలీసులు టీడీపీ హయాంలో రౌడీలు, తీవ్రవాదులపై పోరాడారు, మత కలహాలు నిరోధించారని గుర్తుచేశారు. ఇప్పుడు పోలీసులు ప్రభుత్వ ఒత్తిడితో తమను ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు. పోలీసులకు సరెండర్ లీవులు కూడా రావటం లేదని.. నేను సీఎం అయ్యాక ఆ పని చేస్తానని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర విభజన వెంటనే ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇచ్చానన్న చంద్రబాబు.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ, ఫిట్మెంట్ సంగతి అటుంచి కనీసం జీతాలు సరిగా ఇవ్వటం లేదని విమర్శించారు.